గగన్‌యాన్‌‌కు రష్యా ‘లైఫ్​ సపోర్ట్ సిస్టం’

ఇస్రో చేపట్టనున్న చరిత్రాత్మక గగన్‌‌యాన్ మిషన్ కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డెడ్‌‌లైన్ డిసెంబర్ 2021 కావడం, టైం చాలా తక్కువగా ఉండటంతో మన సైంటిస్టులు అవసరమైనంత మేరకు చిరకాల మిత్రదేశం రష్యా నుంచి అన్ని రకాలుగా సాయం తీసుకుంటున్నారు. మన ఆస్ట్రోనాట్లకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించిన రష్యా.. తాజాగా అత్యంత కీలకమైన లైఫ్​సపోర్ట్ సిస్టం, స్పేస్ క్రాఫ్ట్ హీటింగ్ మెకానిజం విషయంలోనూ సాయం చేసేందుకు ఓకే చెప్పింది. దీనికి సంబంధించి ఇటీవలే రష్యన్ రాస్కాస్మోస్ అనుబంధ సంస్థ గ్లావ్ కాస్మోస్, ఇస్రో అనుబంధ సంస్థ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ ఎఫ్​సీ) మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై గ్లావ్ కాస్మోస్ డీజీ దిమిత్రీ లోస్కుతోవ్, హెచ్ఎస్ ఎఫ్​సీ హెడ్ ఉన్నిక్రిష్ణన్ నాయర్ సంతకాలు చేశారు.  ఒక మనిషి అంతరిక్షంలో సురక్షితంగా ఉండేందుకు అవసరమైన అన్ని అత్యవసర పరికరాలను కలిపి లైఫ్​సపోర్ట్ సిస్టం అంటారు. నిరంతరం ఆక్సిజన్ సరఫరా, నీళ్లు, తిండి, బాడీ టెంపరేచర్ నియంత్రణ, మూత్రం, ఇతర వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ ఇందులో భాగమే.  ఇక మిషన్ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ స్పేస్ క్రాఫ్ట్‌‌లో ఎక్కడా టెంపరేచర్ మితిమీరి పెరిగిపోకుండా, అన్ని భాగాలు సరైన టెంపరేచర్ లోపలే ఉండేలా థర్మల్ కంట్రోల్ సిస్టం చూస్తుంది. స్పేస్ క్రాఫ్ట్‌‌లోని ఏదైనా ఒక్క భాగం విపరీతమైన టెంపరేచర్‌‌తో వేడెక్కి డ్యామేజ్ అయినా, మొత్తం స్పేస్ క్రాఫ్ట్ కే తీవ్ర ముప్పు కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సిస్టం కూడా చాలా ముఖ్యమైనదే. ఈ రెండు సిస్టంల తయారీ, వాడకంలో రష్యాకు1960‌‌‌‌‌‌‌‌ల నుంచే అనుభవం ఉంది.