రైతుబంధు సాయంలో కోతలు

సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి

8లక్షల మందికి సాయమందలే

2018-19 రబీలో 1.85 లక్షల మందికి..

2019 ఖరీఫ్‌‌‌‌లో 5.96 లక్షల మందికి మొండి చెయ్యి

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో రైతుబంధు పథకానికి ప్రతి సీజన్​ లో కోత పడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనమిక్ సర్వే 2020లో ప్రభుత్వమే ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మందికి రైతు బంధు సాయం ఇవ్వలేదని ఆ సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

పథకం మొదలైనప్పుడు అందరికీ..

రైతుబంధు పథకం ప్రారంభంలో 50 లక్షల మందికిపైగా రైతులకు పెట్టుబడి సొమ్ము అందింది. తర్వాతి నుంచి రైతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం 2018 ఖరీఫ్‌‌‌‌ నుంచి రైతు బంధు పథకం అమలు మొదలుపెట్టింది. ఎకరాకు ఒక్కో సీజన్​కు రూ.4 వేల చొప్పున ఏటా రూ.8 వేలు ఆర్థి్క సాయం అందిస్తామని చెప్పింది. భూమికి పట్టా ఉంటే చాలు ఎన్ని ఎకరాలున్నా సాయం ఇస్తామని చెప్పింది. 2018లో అసెంబ్లీ రద్దుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా 50.88 లక్షల మంది రైతులకు నేరుగా చెక్కుల రూపంలో రైతు బంధు సొమ్ము పంపిణీ చేశారు. ఇక 2018 ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు సొమ్మును సీజన్​కు రూ.5 వేల చొప్పున ఏటా రూ.10 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే రైతు బంధు సొమ్ము అందుకునే రైతుల సంఖ్య మాత్రం తగ్గిపోతోంది. ప్రభుత్వం అనధికారికంగా కోతలు పెడుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సాయం పెంచినా భారం పడలే!

రైతు బంధు సాయాన్ని పెంచినా రాష్ట్ర ఖజానాపై భారం పడలేదని సర్వేలోని లెక్కలు చెప్తున్నాయి. 2018 ఖరీఫ్‌‌‌‌ సీజన్ లో రూ.4 వేల చొప్పున అందించినప్పుడు రూ.5,257 కోట్లు వ్యయం అయ్యాయి. అదే 2019 ఖరీఫ్ కు ఎకరా రూ.5 వేల చొప్పున ఇచ్చినా సర్కారు చేసిన ఖర్చు రూ.5,456 కోట్లు మాత్రమే. దీనికి కారణం సుమారు ఆరు లక్షల మంది రైతులకు కోత పెట్టడమేనని స్పష్టమవుతోంది. పెంచిన మేర సొమ్మును అందరు రైతులకు అందిస్తే ప్రభుత్వం సుమారు రూ.6,300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ రైతులకు కోత పెట్టడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల మేర మిగుల్చుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి.

 

Latest Updates