రైతు వేదికల నిర్మాణంలో.. సగం పైసలు కేంద్రానివే

కేంద్ర ఉపాధి హామీ ఫండ్స్ వాడుకుంటున్న రాష్ట్ర సర్కారు

ఎక్కడా కేంద్ర నిధుల గురించి ప్రస్తావించలే

రాష్ట్రవ్యాప్తంగా 1,580 వేదికల నిర్మాణం పూర్తి

నేడు కొడకండ్లలో ప్రారంభించనున్న కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,580 వేదికల నిర్మాణం పూర్తయినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. అయితే రైతు వేదికల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా.. వీటి నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఉపాధి హామీ ఫండ్సే సగం ఉండడం గమనార్హం. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి సర్కారు ప్రస్తావించడం లేదు. తామే నిర్మిస్తున్నట్ల చెప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ.572.22 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఇందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి రూ. 312.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్​ఆర్ఈజీఎస్​) నుంచి రూ. 260.10 కోట్లు కేటాయించారు. ఒక్కో వేదిక నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.12 లక్షలు ఉండగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.10 లక్షలు ఉండడం గమనార్హం. గ్రామాల్లో 2,462 రైతు వేదికలు నిర్మిస్తుండగా, అర్బన్ ఏరియాల్లో 139 వేదికలను నిర్మిస్తున్నారు. వీటిలో పూర్తిగా దాతలు ఇచ్చిన విరాళాలతో 24 వేదికలు నిర్మిస్తుండడం విశేషం. ఈ వేదికలకు మిషన్ భగీరథ అధికారులు నల్లా కనెక్షన్, విద్యుత్​ శాఖ అధికారులు కరెంట్ మీటర్ కనెక్షన్ ఇచ్చారు.

నేడు కొడకండ్లలో ప్రారంభం

రైతులకు పంటల సాగులో మెళకువలపై ట్రైనింగ్ ఇచ్చేందుకు, వారంతా ఒక చోట సమావేశమై తమ సమస్యలు, ఇబ్బందులను చర్చించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేరుగా రైతులతో మాట్లాడేలా వీటిని నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీటిని వినియోగించనున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను శనివారం మధ్యాహ్నం 12.30కు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత పల్లె ప్రకృతివనాన్ని సందర్శించనున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు.

కేసీఆర్..​ దేశానికే ఆదర్శం: ఎర్రబెల్లి

జనగామ, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత సీఎం కేసీఆర్​దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రమూ అమలు చేయడం లేదన్నారు. మన రాష్ర్టంలో మాత్రమే రైతు బంధు సమితులు ఉన్నాయని చెప్పారు. కొడకంట్లలో ఏర్పాట్లను పర్యవేక్షించిన తర్వాత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రైతులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతుబంధు సమితి సభ్యులు, సైంటిస్టులు సమావేశమయ్యేలా వేదికలు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి, ప్రతి క్లస్టర్ లో రూ.22 లక్షల ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తున్నామని తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తొలి రైతు వేదిక ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.

For More News..

పర్మిషన్లు లేవ్​.. అప్పులు పుడ్తలేవ్​.. ప్రాజెక్ట్ పనులు ఆపేద్దామా

టెండర్లు లేకుండా పనులెట్ల ఇస్తరు?

దుబ్బాకలో బీజేపీ జోష్

Latest Updates