మంత్రి సబితకు గ్రాండ్ వెల్‌కం చెప్పిన సర్పంచ్‌కి ఫైన్

మహేశ్వరం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గ్రాండ్ వెల్‌కం చెప్పిన సర్పంచ్‌కు ఆమె స్వయంగా ఫైన్ వేయించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం తిమ్మాపూర్​లో ఈ ఘటన జరిగింది. చెత్త ఎక్కడపడితే ఎక్కడ పడేస్తే జబ్బులు వస్తాయని, అలా చేయొద్దని సూచించారు మంత్రి.

సోమవారం తిమ్మాపూర్‌లో జరిగిన రైతు పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెకు ఆ గ్రామ సర్పంచ్ పటాకులు పేల్చి, పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. దీనిపై సభలో మాట్లాడుతూ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తవేయొద్దని, అలా కాకుండా ఎక్కడపడితే అక్కడ పడేస్తే ఫైన్ వేయాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. మొదటగా రోడ్డుపై పటాకులు పేల్చి, పూలు వేసినందుకు సర్పంచ్‌కు రూ. వెయ్యి జరిమానా విధించాలన్నారు. ఊరిలో జనమంతా చెత్త ఎక్కడ పడేస్తున్నారని మంత్రి అడగ్గా రోడ్డు పక్కనేనని చెప్పడంతో సభలో అంతా ఒక్కసారి నవ్వారు. అలా చేయొద్దని ఆమె సూచించారు. తిమ్మాపూర్‌లో డంప్ యార్డ్ కోసం త్వరలోనే స్థలం కేటాయిస్తామని, చెత్త ఎత్తేసేందుకు ఇప్పటికే ట్రాక్టర్ అందజేశామని తెలిపారు మంత్రి సబిత. మన ఆరోగ్యం కోసం స్వచ్ఛత పాటించాలని, చెత్త పేరుగుపోతే జబ్బులు వస్తాయని అన్నారామె.

కాగా, అంతకు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వీలైనంత భూసమస్యలను పరిష్కరిస్తామని చెప్పారామె. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Latest Updates