నెత్తిపై చెయ్యేసి ప్రార్థిస్తే నా కొడుకు బతుకుతాడనుకున్నా.. ఓ తల్లి ఆవేదన

మతగురువు నెత్తి మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తే అనారోగ్యం నయమవుతుందని… ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకు బతుకుతాడని ఓ తల్లి పెట్టుకున్న ఆశలు నిజం కాలేదు. ఓ అభాగ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగింది.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం.. మద్దిరాల గ్రామానికి చెందిన రాజేష్ అనే 21 ఏళ్ల యువకుడు.. గత 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డాడు. అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కన్నా బెల్లంపల్లిలోని ఓ ప్రార్థన మందిరానికి తీసుకెళ్తే నయం అవుతుందని అనుచరులు చెప్పడంతో.. బాధితుడిని సూర్యాపేట నుండి బెల్లంపల్లికి తీసుకొచ్చింది ఆ తల్లి.

ఐదురోజులు గడిచిన తర్వాత.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లమంటూ.. నిర్వాహకులు బొలెరో ట్రాలీలో ఎక్కించి పంపించారు. ఐతే.. 3 గంటలపాటు వాహనంలో బెల్లంపల్లిలో అటూఇటూ తిప్పారని.. అంతలోనే తన కొడుకు చనిపోయాడని ఆ తల్లి ఆవేదనగా చెప్పింది.

ఐదురోజులుగా తన కొడుకును ఎవరూ పట్టించుకోలేదని.. వేదికపైకి పిలుస్తారని ఎదురుచూసినా కూడా ఎవరూ పిలవలేదని ఆమె ఆవేదనగా తెలిపింది. మతగురువు నెత్తి మీద చెయ్యి వేస్తే.. లేచి నిల్చున్నారంటూ అక్కడివాళ్లు సెల్ ఫోన్లలో వీడియోలు చూపిస్తే నమ్మానని ఆవేదనగా చెప్పింది. వాళ్ల మాటలు నమ్మకుండా..  ఏ దవాఖానాకో తీసుకెళ్లినా తన 21 ఏళ్ల కొడుకు బతికి ఉండేవాడనీ.. ఇలాంటి కడుపు కోత ఏ తల్లికీ రావొద్దని ఆమె ఏడుస్తూ చెప్పింది.

మృతుడి తల్లి, మేనత్త ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.

ఇప్పటికయినా ప్రజలు నిజాలు తెలుసుకోవాలని.. మతగురువులను నమ్మి మోసపోవొద్దని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సూచించింది. ప్రభుత్వం వెంటనే మూఢ నమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలని కోరింది.

 

Latest Updates