మూడు సార్లు ప్రమాణం చేసిన ఎంపీ సాధ్వి ప్రజ్ఞా

మూడు సార్లు ప్రమాణం చేసిన ఎంపీ సాధ్వి ప్రజ్ఞా

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇవాళ నిరసనల మధ్య లోక్ సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఈ ఉదయం వరుస క్రమంలో ఎంపీలు లోక్ సభలో ప్రమాణం చేశారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా తన వంతు వచ్చినప్పుడు ప్రమాణం చేయబోయారు. ఆమె తన పేరుకు తన గురువు పేరును కూడా చేర్చి ప్రమాణం చేయబోయారు. “సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పూర్ణ్ చేతనానంద్ అవదేశానంద్ గిరి అనే నేను……” అంటూ ప్రమాణం మొదలుపెట్టారు. దీనిపై లోక్ సభ అధికారులు అభ్యంతరం చెప్పారు. తండ్రి పేరు చెప్పొద్దని.. సొంత పేరుమాత్రమే చెప్పాలని సూచించారు. అది తన పూర్తి పేరని ఆమె అధికారులతో అన్నారు. అలాగే రాసిచ్చానని చెప్పారు. అలా చెప్పొద్దని విపక్ష సభ్యులు నినాదాలు చేసేసరికి సభలో గందరగోళం చెలరేగింది.

దీనిపై ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ వెంటనే స్పందించారు. రికార్డులు పరిశీలిస్తున్నా.. సంయమనం పాటించాలంటూ విపక్షాలకు సూచించారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు అధికారులు ఏ పేరుతో ధ్రువీకరణ పత్రం ఇచ్చారో అదే పేరుతో ప్రమాణం చేయాలని  అటు ప్రొటెం స్పీకర్, ఇటు అధికారులు ఆమెకు సూచించారు. దీంతో.. మూడో సందర్భంలో ఆమె ప్రమాణం పూర్తిచేశారు.