డేట్‌ ఫిక్స్ … డిసెంబర్ 16న సైనా, కశ్యప్ పెళ్లి

ముంబై : కశ్యప్ తో పెళ్లిపై వస్తున్న రూమర్లకు పుల్ స్టాప్ పెడుతూ.. క్లారిటీ ఇచ్చేసింది హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్. “ఔను.. మేమిద్దరం ఈ ఏడాది డిసెంబర్ 16న పెళ్లిచేసుకోవాలని డిసైడయ్యాం. బిజీ షెడ్యూల్ ఉండటంతో… ఇదే కరెక్ట్ టైమ్ అని అనుకుంటున్నాం” అని ముంబైలో జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది సైనా నెహ్వాల్.

“డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాము. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని అనుకున్నాం” అంది సైనా.

తమ స్నేహం, ప్రేమ, పెళ్లి గురించిన సంగతులు కూడా పంచుకుంది. “2005 నుంచి గోపిచంద్‌ అకాడమీలో ఇద్దరం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. కెరీర్ ఒకటే కావడంతో… 2007 నుంచే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఇద్దరం ఒకరి ఆటపై మరొకరం దృష్టిపెట్టాం. తప్పొప్పులు చర్చించుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాం. పెద్ద విజయాలనే లక్ష్యంగా పెట్టుకుని.. ఇద్దరం కలిసే ఆటలో జర్నీ చేశాం. పోటీ ఎక్కువగా ఉండే ఈ గేమ్ లో నిజాయితీగా తమ అభిప్రాయాలు చెప్పేవాళ్లు చాలా అరుదు. పెళ్లికి ముందు… పెళ్లి తర్వాత లైఫ్ వేరు. అందుకే.. ముందు పెళ్లి గురించి మేం ఆలోచించలేదు. ఆటలో గెలవాలనుకుని… స్నేహితులుగా కలిసి నడిచాం. కామన్ వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ ముందే తొందరతొందరగా పెళ్లి చేసేసుకోవాలని అనుకోలేదు. త్వరలో పెద్ద టోర్నీలు ఉండటంతో… అంతకుముందే పెళ్లిచేసుకోవడం కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చేశాం” అని చెప్పింది సైనా.

అమ్మానాన్నకు చెప్పారా అని అడిగితే… “వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరితో స్నేహంగా ఉన్నాను.. ఎవరితో ఎక్కువ సేపు మాట్లాడుతున్నాను.. ఎవరితో నా విజయాలను, పరాజయాలను పంచుకున్నాను.. ఇలాంటివన్నీ మా అమ్మానాన్నలు గమనిస్తూనే వచ్చారు. నాకు ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో వాళ్లు చూస్తూనే ఉన్నారు.  ఇప్పుడు పెళ్లి గురించి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ ఉండదు” అని చెప్పింది స్టార్ షట్లర్.

 

Posted in Uncategorized

Latest Updates