సోమవారం కల్లా కార్మికులకు జీతాలు!

సిబ్బంది సమ్మెలో ఉండటం వల్లే ఆలస్యం
హైకోర్టు విచారణలో చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం
సోమవారానికి వాయిదా వేసిన బెంచ్
మానవీయ కోణంలో సమస్యను
చూడాలన్న కార్మికుల తరఫు లాయర్
అవసరమైతే పనిచేసేందుకు
వంద మంది ఉద్యోగులు సిద్ధమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలోనే సెప్టెంబర్​ నెల జీతాలు ఆలస్యమయ్యాయని ఆర్టీసీ యాజమాన్యం తరఫు లాయర్​ హైకోర్టుకు తెలిపారు. శుక్రవారం నాటికే జీతాలు చెల్లించేలా చూడాలని కార్మికుల తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని, సోమవారం వరకూ జీతాలు చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళతామని ఆర్టీసీ తరఫు లాయర్​ కోర్టుకు చెప్పారు. సెప్టెంబర్‌‌ నెల జీతాలు వెంటనే ఇచ్చేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ ఆర్టీసీ జాతీయ మజ్దూర్‌‌ యూనియన్‌‌ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు వేసిన రిట్‌‌ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి విచారించారు. తొలుత పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదిస్తూ.. వెంటనే జీతాలు చెల్లించేందుకు స్టాఫ్‌‌ అవసరమైతే వంద మంది పనిచేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, రెండు దినాల్లో జీతాల నగదును హైకోర్టు రిజిస్ట్రీ వద్ద జమ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

అప్పు వాయిదా చెల్లించలేక ఇప్పటికే ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, మానవీయ కోణంలో సమస్యను చూడాలని విజ్ఞప్తి చేశారు. జీతాల చెల్లింపుపై ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేసింది. కేసు వాయిదా పడిన తర్వాత పిటిషనర్​ తరఫు లాయర్​ ప్రభాకర్​ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారంలోపు జీతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ తరఫు లాయర్​ కోర్టుకు చెప్పినట్టుగా తెలిపారు. ఆదివారంలోపల జీతాలు చెల్లించని పక్షంలో సోమవారం నాడు మళ్లీ విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించిందని ఆయన తెలిపారు.

 

Latest Updates