జీతాలు చెల్లించట్లేదని సమ్మెకు దిగిన లెక్చరర్లు

హైదరాబాద్: కరోనా పరిస్థితుల్లో తమకు జీతాలు చెల్లించడం లేదంటూ అర్జున్ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్లు సమ్మెకు దిగారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ కాలేజీ లెక్చరర్లు వాపోయారు. ఈ విషయాన్ని లెక్చరర్లు తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్‌‌‌టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంతోష్ స్పందిస్తూ.. కరోనా పరిస్థితుల్లో మార్చి నుంచి జూలై వరకు సగం జీతాలు వేశారని, ఆ జీతాలతో లెక్చరర్లు బతికేది కష్టమన్నారు. వాళ్లతో అన్ని పనులు చేయించుకొని జీతాలు చెల్లించడం లేదని, అడిగితే ఉద్యోగం నుంచి తొలగించారని సీరియస్ అయ్యారు.

‘రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 45 ప్రకారం జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. యూనివర్శిటీ రిజిస్ట్రార్ సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. జీతాలు అడిగితే 7 నెలల గర్భవతి అయిన మహిళా అధ్యాపకులను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలి. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మార్చి 27 , 2017ను అమలు చేయాలి’ అని సంతోష్ డిమాండ్ చేశారు.

Latest Updates