పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

  • విద్యాశాఖ ఉన్నతాధికారులనే తప్పుదోవ పట్టించిన వైనం
  • ఏపీలో టీచర్ల బదిలీల వేళ బయటపడ్డ బండారంతో కలకలం

పనిచేయకున్నా జీతాలు చెల్లించడమే కాదు.. ఏకంగా పదోన్నతి కల్పించి బదిలీ చేసిన వైనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగింది. విద్యాశాఖ ఉన్నతాధికారుల కళ్లు కప్పి మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీగ లాగడంతో డొంకంతా కదులుతోంది. ఒక్కడే ఇలా మోసం చేయడం కష్టం కాబట్టి ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు  స్పష్టంగా తెలుస్తోంది. బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ తనకు అందిన అనుమానాస్పద సమాచారంతో తీగంతా లాగడంతో మొత్తం డొంక కదిలింది. సమాచార హక్కు చట్టం కింద పక్కా సమాచారంతో ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఏపీలోని విద్యాశాఖలో టీచర్ల బదిలీలు జరుగుతున్న వేళ ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. లాంగ్వేజ్ పండిట్లు మినహా అన్ని బదిలీలు పూర్తయిన క్రమంలో ఎన్నికల కోడ్ కూడా రావడంతో.. వీటిపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.  ఒక టీచర్.. ఏకంగా విద్యాశాఖనే తప్పుదోవ పట్టించిన వైనం సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగిందంటే…

కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయాల్సిన టీచర్ మురళీధర్ అక్కడ పనిచేయలేదు. విధులకు డుమ్మా కొట్టేశాడు. ఏం చేశాడో గాని.. మండల కేంద్రమైన గడివేముల ప్రాథమిక పాఠశాలలో పనిచేసినట్లు అప్పటి ఇంచార్జి ఎంఇఓ ప్రస్తుత నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ నారాయణతో కలిసి బోగస్ ఉత్తర్వులు సృష్టించాడు. దాదాపుగా 18 నెలలు పనిచేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించి జీతాలు తీసేసుకున్నాడు. మురళీధర్ విధులకు డుమ్మాకొడుతున్నాడన్న విషయం పై 2013లోనే బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కె. సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. 2012 ఆగష్టు లో ఎమ్మార్పీ వ్యవ్యస్థ రద్దైనా కూడా తాను పనిచేయాల్సిన మంచాలకట్ట స్కూల్ వెళ్లకుండా గడివేముల ఎమ్మార్సీలో పనిచేసినట్లు బోగస్ రికార్డులు సృష్టించి ఠంచనుగా జీతాలు తీసేసుకున్నాడని ఆయన పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. అలా మొత్తం 18 నెలల కాలం విధులకు హాజరుకాకుండానే జీతాలు తీసుకుని ఎంఈవోతో కలసి విద్యాశాఖను మోసం చేశారు. దీనిపై 2015లో  ఒకసారి విచారణ జరిగినా తూతూ మంత్రంగా జరిపించారు. విచారణ నివేదిక ఏమైందనేది కూడా బయటకు రాలేదు. బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తొక్కిపెట్టినట్లు అర్థమైంది.  తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ మురళీధర్ పై విచారణ చేసి చర్యలు తీసుకోకపోగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా ఇటీవలే పదోన్నతి ఇచ్చి సత్కరించారు. రేపో మాపో అతనిపై వేటు వేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా పదోన్నతి ఇచ్చి పంపడం ఉపాధ్యాయ వర్గాలను కుదిపేసింది. కొందరు ఆగ్రహంతో ఉన్నతాధికారులను బహిరంగంగా నిలదీశారు. అయితే బీటీఎఫ్ తరపున సతీష్ కుమార్ బృందం మురళీధర్ అక్రమాల వ్యవహారంపై చర్యలు తీసుకుంటారా.. లేదా తేల్చి చెప్పాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా నంద్యాల ఉప విద్యాశాధికారి కార్యాలయంలో శనివారం సాయంత్రం విచారణ జరిగింది. అక్రమాలకు పాల్పడేందుకు సహకరించిన అప్పటి ఎంఈవో నారాయణ, టీచర్  మురళీధర పై చర్యలు తీసుకుని టీచర్ మురళిధర్ కు ఇచ్చిన పదోన్నతి రద్దు చేయాలని బీటీఎఫ్ నాయకులు సతీష్ కుమార్, మురళీధర, శేషయ్య, సుబ్బయ్య విచారణ సందర్భంగా అధికారులను డిమాండ్ చేశారు.

విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించిన ఉత్తర్వులు ఇవే

New doc Jan 24, 2021 12.54 PM

ఇవి కూడా చదవండి..

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు

షాకింగ్ సర్వే: అమ్మాయిలు ఫోన్‌‌లు ఎంతసేపు వాడుతున్నారో తెలుసా?

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

Latest Updates