రీమేక్ లపై క్లారిటీ ఎప్పుడొస్తుందో!

రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా ఉంది సమంత కెరీర్‌‌. ఇప్పటికే యు టర్న్, ఓ బేబీ, జాను అంటూ పలు రీమేక్ చిత్రాలు చేసింది. మరిన్ని రీమేక్స్ కోసం పలువురు ఫిల్మ్ మేకర్స్ సమంత చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన రీమేక్ సినిమాలు కమర్షియల్‌గా రికార్డులు సృష్టించకపోయినా.. సమంతను మాత్రం గొప్ప నటిగా ప్రూవ్ చేశాయి. నందినీ రెడ్డితో ఆమె చేయబోయే నెక్స్ట్‌ మూవీ కూడా ఒక కొరియన్ రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కన్నడ చిత్రం ‘దియా’లో కూడా సమంత నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సమంతను బాగా ఆకట్టుకుందని, అందుకే ఓ ప్రముఖ నిర్మాత అడగ్గానే ఆమె ఓకే అందని చెబుతున్నారు. ఏ విషయాన్నయినా మనసులోనే దాచుకుని మథనపడే ఓ  అమ్మాయి..  ప్రేమలో పడిన తర్వాత ఎలా మారుతుందో తెలిపేదే ఈ కథ. అయితే సమంత నటించదని, నిర్మించనుందనే మరో వార్త కూడా వినిపిస్తోంది. మరోపక్క ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు సినిమా తీయనున్నారని, సమంత లీడ్‌ రోల్ చేయనుందని మరో న్యూస్. సమంతకు సంబంధించి వరుస వార్తలు వినిపిస్తున్నా, వీటిలో ఏది నిజమో ఏది కాదో తెలియని కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. వీటన్నిటి విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో ఏమో.

Latest Updates