ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేనేజర్ తో లేనని చెప్పించా

విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఆమె నటించిన ‘జాను’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇది ‘96’ తమిళ చిత్రానికి రీమేక్ . ఈ సందర్భంగా సమంత చెప్పిన సంగతులు..

ఈ సినిమా రీమేక్ చేయడమంటే రిస్క్ చేయడమే అనుకున్నాం. క్లాసికల్ లవ్ స్టోరీని రీమేక్ చేయడం చాలా కష్టం. కానీ మాతృకలో డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకుడు కావడంతో నాకు నమ్మకం వచ్చింది. మొదటి రోజు షూటింగ్​లోనే ఏదో మ్యాజిక్ జరగబోతోందని తెలిసింది. సినిమా చూసి ప్రేక్షకులు కూడా మ్యాజిక్ ఫీలవుతారు.

రీమేక్ చేయకూ‌‌డదని నిర్ణయించుకుని దిల్ రాజు గారిని చాలా రోజులు కలవలేదు. ఆయన ఫోన్ చేసినా మేనేజర్‌‌తో లేనని చెప్పించేదాన్ని. ఎందుకంటే ఆయన వస్తే నన్ను గ్యారంటీగా ఒప్పిస్తారు. చివరికి అదే జరిగింది. నిజంగానే వచ్చి ఒప్పించారు. ఈ సినిమా చేయకపోతే ఓ మంచి సినిమా మిస్సయ్యేదాన్ని. ఇది నా కెరీర్​లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది.

‘96’ మూవీలో విజయ్ సేతుపతి, త్రిష అద్భుతంగా పర్‌‌ఫార్మ్ చేశారు. అందరూ విజయ్ సేతుపతి గురించి మాట్లాడారు  కానీ.. నాకు మాత్రం త్రిష నటనే బాగా నచ్చింది. అది త్రిష సినిమానే అనిపించింది. తన నటన సూపర్బ్. కాపీ చేయాలని చూస్తే వర్కవుట్ కాదు. చేయలేదు కూడా. కానీ నా పాత్రకు నేను న్యాయం చేశాను. తనకంటే బెటర్‌‌గా  చేశానో లేదో మాత్రం ప్రేక్షకులే చెప్పాలి.

‘ఫ్యామిలీమేన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ పూర్తయింది. దాని కోసం బాగా హార్డ్ వర్క్ చేశాను. డూప్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను.  హీరోలు సినిమాల్లో ఫైట్స్ కోసం ఎంత కష్టపడతారో అర్ధమైంది.

‘రంగస్థలం’ తర్వాత సమంత ఏ సినిమా చేసినా హిట్ అవుతుందని చాలామంది అన్నారు. నిజానికి నాకు ‘రంగస్థలం’ కథ తెలీదు. నా క్యారెక్టర్ గురించి మాత్రమే నేను తెలుసుకున్నాను. నేను ప్రతి నిర్ణయం తెలివిగా తీసుకుంటానని అనుకుంటారు. కానీ నా దగ్గరకే అలాంటి సినిమాలు వస్తున్నాయి. అందుకే నాకు పేరొస్తోందనుకుంటా.

చాలెంజింగ్ పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. పదేళ్ల తర్వాత కూడా ఆ పాత్ర గురించి మాట్లాడుకునేలా ఉండాలి. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేను పేరు కోసమే పనిచేశాను. డబ్బుల గురించి ఆలోచించకుండా పని చేస్తే సినిమా ద్వారా ఎంత పేరు వస్తుందో చూశాను. పేరు వస్తే డబ్బు దానికదే వచ్చేస్తుంది.

Latest Updates