గ్యాంగ్ రేప్ చేసి.. గొంతు కోసి చేతులు నరికేశారు

ఆదిలాబాద్‍ అర్బన్‍, వెలుగు: పనికోసం ఒంటరిగా బయటకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్న ‘సమత’ను ముగ్గురు రాక్షసులు కాపుకాచి గ్యాంగ్​ రేప్​ చేశారు. ఆపై దారుణంగా హత్య చేశారు. ఆమె గొంతును కోసి, చేతులు, చేతివేళ్లను నరికేశారు. నగలను ఎత్తుకుపోయారు. ఈ కేసులో నిందితులు షేక్‍ బాబు, షేక్ షాబుద్దీన్‍, షేక్ మగ్దూంను అరెస్టు చేసిన పోలీసులు  చార్జిషీట్​ దాఖలు చేశారు. ఘటన పూర్తి వివరాలతో 144 పేజీల చార్జిషీట్​ను శనివారం ఆదిలాబాద్​లోని ఫాస్ట్​ట్రాక్​కోర్టుకు ఆసిఫాబాద్‍ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ ఎం.రమణారెడ్డి అందజేశారు. సైంటిఫిక్​ ఆధారాలను, ఫోరెన్సిక్​ రిపోర్టును అందులో పొందుపరిచారు. మొత్తం 44 మంది సాక్షులను చేర్చారు. ఫాస్ట్ ట్రాక్‍ కోర్టు జడ్జికి చార్జిషీట్​ అందజేశామని, జడ్జి ఆదేశాల ప్రకారం విచారణ కోసం రోజువారీగా సాక్షులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు తెలిపారు.

కాపు కాచి… మద్యం తాగి..!

ఆసిఫాబాద్‍ జిల్లా లింగాపూర్‍ మండలం గోసంపల్లికి చెందిన సమత గత నెల 24న ఉపాధి కోసం ఎల్లాపటార్‍కు వెళ్లింది. ఆమె  ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఎల్లాపటార్​కు చెందిన షేక్‍ బాబు, షేక్ షాబుద్దీన్‍, షేక్ మగ్దూం.. తిరిగి అదే మార్గంలో వస్తుందని కాపుకాశారు. రాంనాయక్‍తండా సమీపంలోని గుట్టలాగా ఉన్న ప్రాంతానికి సమత చేరుకోగానే అప్పటికే మద్యం సేవించి ఉన్న ఆ ముగ్గురు ఆమెపై దాడి చేశారు. నోరు మూసి గుట్ట దిగువభాగంలో ఉన్న చెట్ల పొదల్లోకి గుంజుకుపోయారు. నోట్లో గుడ్డ కుక్కి ఒకరి తర్వాత ఒకరు రేప్‍ చేశారు. కత్తితో బాధితురాలి గొంతును కోశారు. చేతులు, చేతి వేళ్లను నరికేశారు. ఆమె ఒంటిపై  ఉన్న నగలను దోచుకొని పారిపోయారు. మరుసటి రోజు చెట్ల పొదల్లో మహిళ శవాన్ని గుర్తించిన లింగాపూర్  పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో రక్తంతో కూడిన బాధితురాలి దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అదే నెల 27న నిందితులు షేక్​బాబు, షేక్​ షాబుద్దీన్​, షేక్​ మగ్దూంను ఆదిలాబాద్​కు సమీపంలోని మావాళ్ల చెక్​పోస్టు వద్ద అరెస్టుచేశారు. హత్య కోసం నిందితులు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు ఆదిలాబాద్​లో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును ఏర్పాటు చేసింది. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, సాక్ష్యాలను సేకరించి చార్జిషీట్​ను ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో సమర్పించారు. చార్జిషీట్​లో ఏ 1గా షేక్​ బాబు (30), ఏ 2గా షేక్​ షాబుద్దీన్​ (40), ఏ 3గా షేక్​ మగ్దూం (30)ను చేర్చారు.

నిందితులపై హత్య, గ్యాంగ్​రేప్​, అట్రాసిటి కేసులు

ముగ్గురు నిందితులపై హత్య, గ్యాంగ్‍ రేప్‍కు సంబంధించి సెక్షన్‍ 302, 376డి సెక్షన్ల కింద పోలీసులు కేసులను నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్‍ 03 సబ్‍క్లాజ్‍ 02, 05 కింద అట్రాసిటి కేసు, బాధితురాలిపై ఉన్న నగలను దోచుకెళ్లినందుకు గాను సెక్షన్‍ 404 ఐపీసీ సెక్షన్‍ల కింద కేసు నమోదు చేసినట్లుగా ఆసిఫాబాద్‍ ఎస్పీ టి.మల్లారెడ్డి, పీపీ ఎం.రమణరెడ్డి మీడియాకు తెలిపారు. ముగ్గురు నిందితులపై నమోదు చేసిన ఈ కేసులో మొత్తం 44మంది సాక్షులను చేర్చారు. ఇందులో ఇద్దరు పోలీస్‍ ఆఫీసర్లు, 32మంది సాధారణ ప్రజలు కాగా.. మిగతావారు డీఎన్‍ఏ, ఎఫ్‍ఎల్‍సీ రిపోర్టు నమోదు చేసిన డాక్టర్లు ఉన్నారు. ఆ ముగ్గురు నిందితులే బాధితురాలిని రేప్‍చేసి చంపినట్లుగా వారి దుస్తులపై మరకలు ఉన్నాయని, డీఎన్‍ఏ రిపోర్టులో కూడా నిర్ధారణ జరిగిందని చార్జిషీట్‍లో పోలీసులు పేర్కొన్నారు. కత్తిపై కూడా రక్తపు మరకలు ఉన్నాయని అందులో పొందుపరిచారు. గతంలో కూడా ఈ ముగ్గురికి నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. విచారణ షెడ్యూల్‍ను జడ్జి నిర్ణయిస్తారని, రోజుకు ఎంతమందిని విచారణకు పిలిచినా అంతమందిని ప్రవేశపెడుతామని పోలీసులు మీడియాకు తెలిపారు. కేసు విచారణ త్వరితగతిన జరిగే అవకాశముంటుందని, ఈ నెలాఖరుకల్లా తుది తీర్పు వెలువడొచ్చని పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ రమణారెడ్డి తెలిపారు.

నిందితుల తరఫున వాదించం: బార్​ అసోసియేషన్​ నిర్ణయం

సమత కేసులో నిందితుల తరఫున తాము వాదించబోమని ఆదిలాబాద్‍ బార్‍ అసోసియేషన్‍ తీర్మానం చేసింది. వారికి కఠిన శిక్షపడాలని, సమతకు న్యాయం జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్‍ అసోసియేషన్‍ అధ్యక్షుడు ఎం.మోహన్‍సింగ్​ తెలిపారు.

 

Latest Updates