
‘సమత’ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముగ్గురు దోషులు షేక్ బాబా (30), షేక్ షాబుద్దీన్(40), షేక్ మగ్దూం (35)కు ఉరిశిక్ష విధించింది. నేరం జరిగిన 67 రోజుల్లోనే తుది తీర్పు వెలువరించింది. నిరుడు నవంబర్ 24న పని ముగించుకుని వస్తున్న ‘సమత’ను షేక్ బాబా, షేక్షాబుద్దీన్, షేక్ మగ్దూం దారికాచి కిడ్నాప్ చేశారు. గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను దారుణంగా చంపేశారు. మరుసటి రోజు అటుగా వెళ్లిన స్థానికులకు మహిళ మృతదేహం కనిపించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అదే నెల 27న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 20 వరకు వాదనలు కొనసాగాయి. ఈ నెల 27న తీర్పు వెలువరించాల్సి ఉండగా.. జడ్జి ఆరోగ్యం బాగోలేకపోవడంతో గురువారం తుది తీర్పు వెలువరించారు. తమకు చిన్నపిల్లలు ఉన్నారని, తమపై ఆధారపడి వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారని, క్షమాభిక్ష పెట్టాలని దోషులు జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చాలా ఘోరమైన నేరమని జడ్జి ప్రియదర్శిని పేర్కొన్నారు. 66 పేజీల జడ్జిమెంట్‌ను వెలువరించారు. తీర్పు అనంతరం దోషులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివచ్చిన సమత కుటుంబసభ్యులు, స్థానికులు.. తీర్పుతో న్యాయం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తమైంది. శిక్షలను వీలైనంత త్వరగా అమలు చేయాలని జనం కోరుతున్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరింది
నా బిడ్డలకు తల్లిని దూరం చేసిన దోషులకు ఉరిశిక్ష విధించడం సంతోషంగా ఉంది. పిల్లలు రోజూ ‘అమ్మా.. అమ్మా..’ అని ఏడుస్తుంటే వాళ్లకు ఏం చెప్పాల్నో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నాకు జాబ్ ఇచ్చినా సంతృప్తి కలుగలేదు. దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడంతో నా భార్య ఆత్మకు శాంతి కలిగింది. కోర్టు ఎంత వేగంగా తీర్పునిచ్చిందో అంతే వేగంగా దోషులను ఉరి తీయాలి. ఆడవాళ్లపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్షను వెంటనే అమలు చేయాలి.
– సమత భర్త
ఆదిలాబాద్/ఆదిలాబాద్ అర్బన్/ఆసిఫాబాద్/ఖానాపూర్, వెలుగు:
‘సమత’ కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు దోషులు షేక్ బాబా(30), షేక్ షాబుద్దీన్(40), షేక్ మగ్దూం(35)కు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ నెల 27న తుది తీర్పు వెల్లడించాల్సి ఉండగా, జడ్జి అనారోగ్యం కారణంగా గురువారం వెలువడింది. నిరుడు నవంబర్ 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలో సమతపై ఎల్లాపటార్‌కు చెందిన షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూం అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేశారు. ఈ కేసులో ఈ నెల 20 న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు విన్న జడ్జి.. వాదనలు పూర్తయ్యాయని ప్రకటించారు. ముగ్గురు దోషులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూంకు గురువారం జడ్జి ఎం.జి. ప్రియదర్శిణి ఉరి శిక్షలు ఖరారు చేశారు. నేరం జరిగిన 67 రోజుల్లోనే తుది తీర్పు వెలువడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ఇలాంటి తీర్పు ఇది రెండోది. 1971లో ఓ హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడింది.
క్షమాభిక్ష పెట్టాలంటూ దోషుల కన్నీళ్లు
శిక్ష ఖరారుకు ముందు ముగ్గురు దోషులను జడ్జి ప్రియదర్శిని కోర్టు హాల్‍కు పిలిపించి మాట్లాడారు. ‘‘మీరు చేసింది తప్పని రుజువైంది. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా?” అని అడిగారు. తమకు భార్య పిల్లలున్నారని, తమ తల్లిదండ్రుల పోషణ కూడా తమపైనే ఉందని దోషులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలంటూ జడ్జిని వేడుకున్నారు. ‘‘మీరు చేసిన నేరం చిన్నది కాదు. చాలా ఘోరమైంది” అంటూ జడ్జి తీర్పు వెల్లడించారు. దోషులకు ఉరిశిక్షతో పాటు వివిధ సెక్షన్ల కింద జరిమానాను విధించారు. తుది తీర్పు నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితురాలి బంధువులు, స్థానికులు అక్కడికి భారీగా తరలివచ్చారు. ముగ్గురు దోషులకు కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిందని తెలియగానే అక్కడ అందరూ హర్షం వ్యక్తం చేశారు. మృతురాలి భర్త.. జిల్లా ఎస్పీ మల్లా రెడ్డి కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భార్య ఆత్మకు శాంతి చేకూరిందని ఆయన అన్నారు.
పనికి వెళ్లి తిరిగి వస్తుంటే..
పొట్టకూటి కోసం ఊరూరు తిరుగుతూ చిన్నచిన్న వస్తువులను అమ్మకునే సమతను ముగ్గురు రాక్షసులు దారుణంగా హత్య చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‍కు చెందిన సమత కుటుంబం ఐదేండ్ల కిందట కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి వలసవచ్చింది. సమత, ఆమె భర్త ఊళ్లలో తిరుగుతూ చిన్నచిన్న వస్తువులను అమ్ముకునేవారు. ఎప్పటిలాగే నిరుడు నవంబర్ 24న భార్యను ఎల్లాపటార్ గ్రామానికి భర్త తీసుకెళ్లాడు. అక్కడ ఆమె వస్తువులను అమ్ముకుంటుండగా.. తాను తిరిగి సాయంత్రం వస్తానని ఆయన చెప్పి మరో ఊరిలో వస్తువులు అమ్మడానికి వెళ్లాడు. సాయంత్రం పని ముగించుకొని ఎల్లాపటార్ నుంచి రాంనాయక్ తాండ వైపు సమత వస్తుండగా.. ఎల్లాపటార్‌కు చెందిన షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూం అటకాయించారు. ఆమెను అక్కడి గుట్టలు, చెట్ల పొదల్లోకి గుంజుకుపోయారు. అప్పటికే ఫుల్లుగా లిక్కర్ తాగిన ఆ ముగ్గురు సమతపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆపై గొంతు కోసి, చేతులు నరికేసి ప్రాణాలు తీసి పారిపోయారు. అదే రాత్రి లింగాపూర్ పోలీస్ స్టేషన్‍లో సమత భర్త ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం ఎల్లాపటార్, రాంనాయక్ తాండ దారిలో చెట్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు నిందితులను అదే నెల 27న మావల మండలం దేవాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఐడీ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఆసిఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఏ1 షేక్ బాబా నుంచి కత్తి, ఏ 2 షేక్ షాబుద్దీన్ నుంచి సెల్ ఫోన్ , ఏ3 షేక్ మగ్దూం నుంచి మృతురాలికి సంబంధించిన రూ. 200 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అత్యాచారం, హత్య ఘటనపై బాధితురాలి కుటుంబీకులు, బంధువులతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు డిసెంబర్ 11న అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో గోప్యత దృష్ట్యా బాధితురాలి పేరును ‘సమత’గా మార్చారు.
90 పేజీల చార్జిషీట్
సమతపై జరిగిన అత్యాచారం, హత్య కేసును విచారించేందుకుగాను హైకోర్టు గతేడాది డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. అదే నెల 14న పోలీసులు 90 పేజీలతో కూడిన చార్జిషీట్‍ను దాఖలు చేశారు. హత్యకు నిందితులు వాడిన కత్తిని, ఇతర సాక్ష్యాధారాలను సమర్పించారు. ఈ కేసులో స్థానికులతో పాటు డాక్టర్లు, పోలీసులు.. ఇలా మొత్తం 44 మందిని సాక్షులుగా చేర్చారు. డిసెంబర్ 23 నుంచి 31 వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్రయల్స్ నడిచాయి. రోజుకు ఏడుగురు చొప్పున మొత్తం 44మంది సాక్షులను విచారించాల్సి ఉండగా కోర్టు 25 మంది సాక్షులను విచారించింది. ఈ నెల 11 వరకు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ అడ్వకేట్ కేసుకు సంబంధిత తమ వాద ప్రతివాదనలను విన్పించారు. సాక్షుల విచారణ సమయంలో నిందితుల తరఫున సాక్షులను ప్రవేశపెట్టేందుకు జడ్జి రెండురోజులపాటు సమయమిచ్చారు. అయితే.. నిందితుల తరఫున సాక్ష్యం చెప్పేందుకు ఎవరు ముందుకు రాలేదు.
20రోజుల్లోనే ఆధారాలు సేకరించినం: ఎస్పీ
జైనూర్/ఆసిఫాబాద్, వెలుగు: సమత కేసులో కోర్టు ముందు బలమైన సాక్ష్యాలు అందించామని, నిందితుల నేరం రుజువై శిక్ష పడిందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. తీర్పు నేపథ్యంలో గురువారం ఆయన జైనూర్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిరుడు నవంబర్ 24నే కేసు నమోదు చేశామన్నారు. ఆధారాలను 20 రోజుల్లోనే సేకరించామని తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలకు రివార్డ్ ఇవ్వాలని పైఆఫీసర్లను కోరుతానని చెప్పారు. విచారణకు పూర్తి సహకారం అందించిన సాక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్మీట్లో డీఎస్పీ సత్యనారాయణ, సీఐ జవ్వాజీ సురేశ్, ఎస్ఐలు తిరుపతి, వెంకటేశ్ పాల్గొన్నారు.
నేడు ఎస్పీ రిటైర్మెంట్
సమత కేసు దర్యాప్తును దగ్గరుండి చూసిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శుక్రవారం పదవీవిరమణ చేయనున్నారు. కేసు తీవ్రత.. ప్రజా సంఘాల ఆందోళన దృష్ట్యా ఆయన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన మూడురోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు
సమీక్షించారు.