రైతులు కోపానికొచ్చిన్రు

రైతులు  కోపానికొచ్చిన్రు

ఖమ్మం, వెలుగు:

మిర్చి ధర ఒక్కసారిగా రూ.13 వేలకు పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో చైర్మన్ ఆఫీసుకు తాళం వేసి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా నుంచి గురువారం దాదాపు 25 వేల బస్తాల మిర్చి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చింది. బుధవారం జెండా పాట రూ.16 వేల వరకు ఉండగా ఒక్క రోజులోనే మూడు వేల రూపాలయలు తగ్గిస్తూ రూ.13 వేల రేటు పెట్టారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. మూడు వారాలకింద రూ.22 వేలు ఉన్న ధర ఇంత తక్కువకు పడిపోవడానికి వ్యాపారుల సిండికేటే కారణమంటూ ట్రేడర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ రైతులు ఆందోళన చేస్తున్నచోటికి వచ్చి.. రైతులకు సర్దిచెప్పారు. వ్యాపారులతో మాట్లాడి జెండా పాట రూ.15వేలు చేసేలా ఒప్పించారు.

కొడంగల్/తాండూరు, వెలుగు:

కందుల కొనుగోలుకు అడ్డగోలు రూల్స్​ పెట్టడంపై రైతులు భగ్గుమన్నారు. కొడంగల్ మార్కెట్‌‌లో మార్క్‌‌ఫెడ్ ఒక రైతు నుంచి ఎకరాకు రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడంపై రైతులు ఆందోళనకు దిగారు. ఎకరాకు రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటే మిగతా పంట ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఎకరాకు 5 క్వింటాళ్లు తీసుకోవాలని డిమాండ్​ చేస్తు కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో గురువారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో కంది రైతులు రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోపై సమాచారం అందుకున్న పోలీసులు రైతులతో దురుసుగా ప్రవర్తించారు. రోడ్లపైకి వచ్చి
ఆందోళనలు, ధర్నాలు చేస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తామని వార్నింగ్​ ఇచ్చారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో రైతులను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్‌‌కు తరలించారు.