మళ్లొస్తం : తల్లులు వనంబాట.. భక్తులు ఇంటిబాట

వనం వీడి జనంలోకి వచ్చి దర్శనమిచ్చిన సమ్మక్క, సారలమ్మ.. వనప్రవేశం చేశారు. భక్తులంతా కొలువంగ మళ్లీ రెండేండ్లకు వస్తామంటూ తిరుగుబాటపట్టారు. వారితోపాటు  పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా కదిలారు. భక్తులు వనదేవతలకు మొక్కులు తీర్చుకొని ఇంటిబాట పట్టారు. దీంతో రెండేండ్లకోసారి ఘనంగా జరిగే మేడారం మహా జాతర ముగిసింది. చివరిరోజు శనివారం వర్షం పడటంతో గద్దెల ప్రాంగణం తడిసిముద్దయింది. కేంద్ర మంత్రి అర్జున్​ముండా, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి​ మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు కోటిన్నర మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేశారు. 

మేడారం, వెలుగు:రెండేండ్లకోసారి వచ్చే మేడారం మహాజాతర ఈసారి కూడా ఘనంగా ముగిసింది. శనివారం సాయంత్రం సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. భక్తులంతా తల్లుల నామస్మరణ చేస్తుండగా.. డోలువాయిద్యాలు, బూరలు లయబద్ధంగా మోగుతుండగా.. వనప్రవేశం జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుకు పూజారులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఎవరికీ వనదేవతలు కనిపించకుండా గద్దెల చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అరగంటపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత సమ్మక్కను తీసుకొని పూజారులు గద్దె దిగారు. ఆ తర్వాత విడిదిగృహం వద్ద నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలుకలగుట్టకు పయనమయ్యారు. మరికొందరు పూజారులు.. పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని గద్దెలు దిగారు. పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లారు. చివరగా సారలమ్మను తీసుకొని కన్నెపల్లికి బయల్దేరారు. వన దేవతలను గద్దెలకు చేర్చేటప్పుడు పోలీసులు ఎలాంటి భద్రత కల్పించారో అంతే కట్టుదిట్టమైన భద్రత నడుమ వనానికి సాగనంపారు.

ఆఖరిరోజు గాలివాన..  మహిళ మృతి

సమ్మక్క, సారలమ్మ జాతర చివరిరోజు శనివారం మధ్యాహ్నం మేడారంలో గాలి వాన వచ్చింది. జంపన్నవాగు వద్ద విద్యుత్‌‌ షాక్‌ ‌తగిలి కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన గంధం లక్ష్మి(40) అనే భక్తురాలు మృతిచెందింది. పలుచోట్ల టెంట్లు కూలిపోయాయి. వాననీటిలో అమ్మల దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు.

కేంద్ర మంత్రి సహా పలువురి రాక

జాతర చివరిరోజున వనదేవతలను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌‌ ముండా దర్శించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి, మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌‌రెడ్డి, సీఎస్  సోమేశ్‌ ‌కుమార్‌‌, డీజీపీ మహేందర్‌‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌ కూడా తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
జగన్‌ ‌మనసు మార్చాలంటూ…

ఏపీ సీఎం జగన్​ మనసు మార్చాలంటూ అమరావతి చుట్టపక్కల ఉన్న 29 ఊళ్ల నుంచి వచ్చిన 58 మంది సమ్మక్క తల్లిని వేడుకున్నారు. ఏపీలో మూడు రాజధానులు అంటూ జగన్​ ప్రకటించి.. అమరావతి ప్రజలను వంచించారని పేర్కొన్నారు.

మళ్లీ రెండేండ్ల తర్వాత

జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. తిరిగి మేడారం మహాజాతర 2022  మాఘ మాసంలో జరుగనుంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సెక్యూరిటీ కల్పించడంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సక్సెస్ అయ్యిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates