కాకతీయలో పేరుకుపోతున్నశాంపిల్స్.. రిపోర్టులు లేట్​

వరంగల్, వెలుగు:వరంగల్​లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్​లో కరోనా శాంపిల్స్​ పేరుకుపోతున్నాయి. ల్యాబ్​ను ఏర్పాటు చేసినా తగినంత సిబ్బందిని నియమించకపోవడంవల్ల ఈ పరిస్థితి నెలకొంది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతోంది. గాంధీ ఆసుపత్రికి శాంపిళ్లు పంపితే రిపోర్టులు రావడానికి రెండుమూడు రోజులు పడుతుండడంతో గత ఏప్రిల్​ నుంచి ప్రభుత్వం కేఎంసీలో టెస్టులు ప్రారంభించింది. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా  శాంపిల్స్​ కేఎంసీకే పంపుతున్నారు. అదనంగా ల్యాబ్​ ప్రారంభించినా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో ఉన్నవాళ్లే రాత్రిపగలు పని చేయాల్సివస్తోంది. వారి మీద పని భారం పెరిగిపోవడమే కాకుండా ల్యాబ్​లో శాంపిల్స్​ పేరుకుపోతున్నాయి.

ఏప్రిల్​ నుంచి ఇక్కడే..

కేఎంసీలో వైరాలజీ ల్యాబ్​ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కోవిడ్​-19 ​ కేసులు ఎక్కువవుతుండటంతో  టెస్టులు పెంచాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా రూ.1.72కోట్లతో  ఏర్పాటు చేసిన ల్యాబ్​ను  ఏప్రిల్​ 17న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​  ప్రారంభించారు. ఐసీఎంఆర్​ ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేసినఈ  గ్రేడ్​3 ల్యాబ్​లో కరోనాతో పాటు  స్వైన్ ఫ్లూ, డెంగీ, చికున్​ గున్యా  వైరస్​టెస్టులు కూడా చేసే అవకాశం ఉంది.

రోజుకు 300 శాంపిల్స్​

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్​ జిల్లాలతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల్లో సేకరించిన శాంపిల్స్ కేఎంసీ వైరాలజీ ల్యాబ్​కు పంపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల జిల్లాలనుంచి,  ఎంజీఎం నుంచి రోజుకు సగటున 300 శాంపిల్స్​ వస్తున్నాయి.  ఒక్కో షిఫ్ట్​లో సగటున 45 నుంచి 50 లోపు శాంపిల్స్ మాత్రమే  టెస్టులు చేసే వీలుంది. ల్యాబ్​లో ఉన్న ఎనిమిది మంది  మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నా 150 లోపే టెస్టులే చేయగలుగుతున్నారు.

అదనపు సిబ్బందిని నియమిస్తేనే మేలు

ల్యాబ్​ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే పని చేస్తున్నారు. ఒక నోడల్​ ఆఫీసర్, రిసెర్చ్​ మెడికల్​ అసిస్టెంట్​, రిసెర్చ్​ నాన్​మెడికల్​ అసిస్టెంట్​, ఇద్దరు రిసెర్చ్​ సైంటిస్టులు, ఇద్దరు ల్యాబ్​ టెక్నీషియన్లు కోవిడ్​-19 టెస్టులు చేస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో  శాంపిల్స్ వస్తుండడంతో డాక్టర్లు, సిబ్బంది మీద పని భారం పెరిగింది.  వారు ఉండేందుకు కేఎంసీ లోనే ఏర్పాట్లు చేశారు.  దీంతో వారు ఇంటికి కూడా వెళ్లకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ల్యాబ్​లో మరో పదిమందిని నియమించాల్సిన అవసరముందని ప్రారంభించినప్పుడు చెప్పిన  మంత్రులు ఆ తర్వాత ల్యాబ్​ ఎలా నడుస్తుందో పట్టించుకోలేదు.  వైరాలజీ ల్యాబ్​లో వెంటనే సిబ్బందిని నియమిస్తే ఉన్నవాళ్లమీద  భారం తగ్గడమే కాకుండా టెస్టుల సంఖ్య పెరుగుతుంది.

ఎటు చూసినా టూ లెట్ బోర్డులే

Latest Updates