గాంధీ హాస్పిటల్​లో ఇవాళ్టి నుంచి ఆంక్షలు

 గాంధీ హాస్పిటల్​లో ఇవాళ్టి నుంచి ఆంక్షలు
  • పేషెంట్లను తప్ప ఇతరులనెవరినీ లోపలికి అనుమతించమన్న అధికారులు

గాంధీ హాస్పిటల్ లో శుక్రవారం నుంచి ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. హాస్పిటల్ లోనికి పాజిటివ్ పేషెంట్లున్న అంబులెన్స్ లను తప్ప మిగతా ఎవరికి అనుమతించేది లేదని గురువారం పోలీస్ ఉన్నతాధికారులు, సెక్యూరిటీ సిబ్బందితో జరిగిన రివ్యూ మీటింగ్ లో గాంధీ పాలన యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ పేషెంట్ల బంధువులను సైతం లోపలికి అనుమతించమన్నారు. పేషెంట్ కు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ను తామే ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీని గురించి పేషెంట్ల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన పడొద్దన్నారు. గాంధీలోని అన్ని వార్డుల కారిడార్లతో పాటు బిల్డింగ్ ఆవరణ, మెయిన్ గేట్ల వద్ద  భారీ పోలీస్ సిబ్బందిని నియమించడానికి నార్త్ జోన్ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హాస్పిటల్ లోపలికి మీడియాకు అనుమతి లేదని పోలీసుల స్పష్టం చేశారు. 

 బెడ్స్ ​పెంచేందుకు  నిర్ణయం

గాంధీలో ప్రస్తుతం 1,890 బెడ్స్​ ఉండగా, ఇందులో 600 ఐసీయూ వెంటిలేటర్​, 1,250 ఆక్సిజన్​, మిగిలినవి సాధారణ బెడ్స్​ ఉన్నాయి.   బుధవారం రాత్రి వరకే బెడ్స్​ మొత్తం నిండిపోవడంతో కొత్తగా వచ్చే పేషేంట్లకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఐసీయూ వార్డుల్లో చనిపోయిన పేషేంట్ల బెడ్లను కొత్తగా అడ్మిట్​ అయ్యే వారికి కేటాయిస్తున్నారు.  డైలీ గాంధీకి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఐదు నిమిషాలకో అంబులెన్స్​  హాస్పిటల్ కి వస్తూనే ఉంది. హైదరాబాద్​, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని దూరప్రాంతాల నుంచి  క్రిటికల్ పేషెంట్లు గాంధీకి వస్తుండటంతో రద్దీ బాగా పెరిగింది. దీంతో గాంధీలో ఇంకా బెడ్స్​ పెంచాలని పాలనా యంత్రాంగం నిర్ణయం తీసుకొంది. మెడికల్ కాలేజీ లైబ్రరీలో దాదాపు 300 ఆక్సిజన్​ బెడ్స్​ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.