అదే ఆఖరి చూపు అనుకోలేదు: కంటతడి పెట్టిస్తున్న ఆ అమ్మ ఆవేదన

ఇసుక లారీ అతి వేగం ఓ తల్లికి కడుపుకోత మిగిల్చింది. బాయ్ అమ్మా అంటూ బడికి బయలుదేరిన కొడుకును తిరిగి ఆ అమ్మ చెంతకు చేరకుండా చేసింది. నడిరోడ్డుపై ఆ బిడ్డ ప్రాణాలను చిదిమేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడో తరగతి విద్యార్థి అవంత్ మరణించాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో చనిపోయిన అవంత్ తల్లి జ్యోతిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. ఆ అమ్మ ఆవేదన చూసి.. అక్కడున్న వారికి సైతం కంటనీరు పెట్టుకున్నారు. ఏడో తరగతి చదువుతున్న తన బిడ్డ క్లాస్‌లోనే ఫస్ట్ అని, బాయ్ అంటూ చెప్పి ఆటో ఎక్కాడని, అదే తనకు ఆఖరి చూపు అవుతుందని అనుకోలేదని విలపించిందామె. తన బిడ్డ రోజూ ఆటోలో మధ్యలో కూర్చునేవాడని, ఈ రోజు లేట్ కావడంతో చివరన కూర్చున్నాడని, లోపల కూర్చోమని చెప్పడానికి తనకు నోరు రాలేకపోయిందని ఆవేదన చెందుతోంది. తన పెద్ద కొడుకు వేదాంత్ కూడా అదే ఆటోలో ఉన్నాడని చెప్పిందామె. బాయ్ అమ్మా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిన తన చిన్నకొడుకు అవంత్ తిరిగిరాని లోకాలకు వెళ్లాడని భోరున విలపిస్తోంది ఆ మాతృమూర్తి.


ఎనిమిది మంది విద్యార్థులతో భాష్యం స్కూల్‌కు వెళ్తున్న ఆటోను ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. ఇసుక లారీ… తార్నాక నుంచి వస్తూ… సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్ దగ్గర వేగంగా యూ టర్న్ తీసుకుంది. క్షణాల ముందు సిగ్నల్ పడడంతో కదిలిన ఆటోను.. గుద్దడంతో పిల్లలతో సహా అది రెండు మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో చివరకు కూర్చున్న అవంత్ కుమార్ తలపగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలోని మరో ఏడుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్‌లో చేర్పించారు. అవంత్ తండ్రి సంతోష్ కుమార్ ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంలో అవంత్ అన్న వేదాంత్‌కు కూడా గాయాలయ్యాయి.

Latest Updates