నేను ఏం చేసినా అది లోక కల్యాణం కోసమే

నిత్యం ఏదో రకమైన సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిగ్గా మారే  సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అలాంటి తరహా కామెంట్సే చేశారు. పీసీసీ చీఫ్ పదవిని లోక కల్యాణం కోసమే అడుగుతున్నట్లు జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని ఇదివరకే కోరినట్లు తెలిపారు.

దీనికి సంబంధించి ఇప్పటికే నా పూర్తి బయోడేటా వివరాలను సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ, అహ్మద్‌ పటేల్‌ వంటి కీలక నేతలందరికి రిజిస్టర్‌లో పోస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు.  అధికారంలోకి తెచ్చే బాధ్యత, అందుకు ఎటువంటి మెడిసిన్ కావాలో తన దగ్గర ఉందన్నారు.

ఇందులో ఎటువంటి పదవీ కాంక్ష లేదని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్ స్వేచ్ఛయూత పార్టీ, నియంత పార్టీ కాదని అభిప్రాయపడ్డారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా నిలదీసే అధికారం , తప్పు చేస్తే పదవీ నుంచి తప్పించడం కాంగ్రెస్ లోనే సాధ్యమన్నారు.  ప్రాంతీయ పార్టీలలా అధినేతల చెప్పుచేతల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ లో ఎంతటివారైనా సోనియా, రాహుల్ అడుగుజాడల్లో నడవాల్సిందేనన్న జగ్గారెడ్డి ఎవరికి వారు హీరో అనుకుంటే నడవదని హితువు పలికారు. రాజకీయ జీవితం టీఆర్ఎస్  నుంచి ప్రారంభం అయ్యిందని,  ఇందులో దాపరికం లేదని జగ్గారెడ్డి మాట్లాడారు.

Latest Updates