సానియా రీ ఎంట్రీ అదుర్స్‌‌

హోబర్ట్ ఇంటర్నేషనల్‌‌ క్వార్టర్స్‌‌కు మీర్జా-కిచెనోక్‌‌ జోడీ

హోబర్ట్‌‌: ఇండియా టెన్నిస్‌ లెజెండ్‌ సానియా మీర్జా రీఎంట్రీలో అదరగొట్టింది. ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి రెండేళ్ల బ్రేక్‌ తర్వాత డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన హైదరాబాదీ స్టార్‌ హోబర్ట్‌‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో అద్భుత విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫస్ట్‌‌ రౌండ్‌లో సానియా–కిచెనోక్‌ జోడీ 2–6,7–6(3),10–3తో ఒక్సానా కలాష్నికోవా (జార్జియా)–మియు కటో (జపాన్‌ ) జంటపై ఉత్కంఠ విజయం సాధించింది. గంటా 41 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇండో–ఉక్రెయిన్‌ జోడీ ఆరంభంలో తడబడింది. రెండు డబుల్‌ ఫాల్ట్స్‌లో ఆట మొదలెట్టిన ఈ జంట ఫస్ట్‌‌ సెట్‌లో ఏడు బ్రేక్‌ పాయింట్లలో ఒక్కదాన్ని కూడా సద్విని యోగం చేసుకోలేకపోయింది. రెండుసార్లు సర్వీస్‌ కోల్పోయి ప్రత్యర్థికి సెట్‌ ఇచ్చుకుంది. అయితే, రెండో సెట్‌లో సానియా–కిచెనోక్‌ ద్వయం గొప్పగా పుంజుకుంది. రెండు జంటలు చెరో మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించడంతో సెట్‌ టై బ్రేక్‌కు దారితీయగా.. మెరుగ్గా ఆడిన సానియా–కిచెనోక్‌ స్కోరు సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. అదే జోరుతో చివరి సెట్‌లో దూకుడుగా ఆడిన ఈ ద్వయం పదునైన రిటర్న్స్‌తో ప్రత్యర్థి పని పట్టింది. క్వార్టర్స్‌లో అమెరికాకు చెందిన వేనియా కింగ్‌ –క్రిస్టినా మెక్‌ హేల్‌తో సానియా–కిచెనోక్‌ ద్వయం పోటీ పడనుంది. చివరగా 2017లో చైనాఓపెన్‌లో ఆడిన సానియా తర్వాతి ఏడాది కొడుకు ఇజాన్‌కు జన్మనివ్వడంతో రెండేళ్లు బ్రేక్‌ తీసుకుంది. రీ ఎంట్రీని విజయంతో ఆరంభించడం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేసింది. ‘ఈరోజు నా జీవితంలో స్పెషల్‌ డే. చాన్నాళ్ల తర్వాత నా ఫస్ట్‌‌ మ్యాచ్‌ను నా పేరెంట్స్‌ , మా అబ్బాయి సమక్షంలో ఆడిగెలిచా. నేను అందుకుంటున్న ప్రేమకు కృతజ్ఞతలు. నమ్మకమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది’ అని సానియా ట్వీట్‌ చేసింది.

Latest Updates