రీ ఎంట్రీతో అదరగొట్టిన సానియా.. టైటిల్ కైవసం

సానియాదే హోబర్ట్‌‌ డబుల్స్‌‌ టైటిల్‌‌

ఇండియా టెన్నిస్‌‌ స్టార్‌‌ సానియా మీర్జా డ్రీమ్‌‌ రీ ఎంట్రీ ఇచ్చింది. బిడ్డకు జన్మనిచ్చి రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే  టైటిల్‌‌తో అదరగొట్టింది. డబ్ల్యూటీఏ హోబర్ట్‌‌ ఇంటర్నేషనల్‌‌ టోర్నమెంట్‌‌లో తన పార్ట్‌‌నర్‌‌ నదియా కిచెనోక్‌‌ (ఉక్రెయిన్‌‌)తో కలిసి సానియా డబుల్స్‌‌లో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అన్‌‌సీడెడ్‌‌ సానియా–-కిచెనోక్‌‌ జోడీ 6–4, 6–4తో సెకండ్‌‌ సీడ్‌‌ చైనాజంట షువై పెంగ్‌‌-షువై జాంగ్‌‌ను వరుస సెట్లలో ఓడించింది. దాంతో, రీఎంట్రీతో పాటు ఒలింపిక్‌‌ ఇయర్‌‌ను ఘనంగా ఆరంభించిన 33 ఏళ్ల సానియా ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ ముందు కాన్ఫిడెన్స్‌‌ పెంచుకుంది.

మీర్జాకు ఇది 42వ డబ్ల్యూటీఏ డబుల్స్‌‌ టైటిల్‌‌. 2018, 2019లో సీజన్లకు దూరంగా ఉన్నప్పటికీ.. ఈ హైదరాబాదీ ఆటలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కొత్త పార్ట్‌‌నర్‌‌ నదియాతో ఈ టోర్నీతోనే రీ ఎంట్రీ ఇచ్చిన సానియా రౌండ్‌‌ రౌండ్‌‌కు మెరుగైన పెర్ఫామెన్స్‌‌తో ఫైనల్‌‌కు దూసుకొచ్చింది. టైటిల్‌‌ ఫైట్‌‌లో ఫస్ట్​ గేమ్‌‌లోనే పెంగ్–‌‌-జాంగ్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసింది. కానీ, వెంటనే తమ సర్వీస్‌‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండు జంటలు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. దాంతో స్కోరు 4–4తో సమం అవగా.. తొమ్మిదో గేమ్‌‌లో 40–40తో ఉన్నప్పుడు సానియా–-నదియా జంట కీలక బ్రేక్‌‌ సాధించింది. తర్వాత తమ సర్వీస్‌‌లో పదో గేమ్‌‌లో సెట్‌‌ కైవసం చేసుకుంది. ఇక, సెకండ్‌‌ సెట్‌‌లోనూ  స్టార్టింగ్‌‌లోనే చైనా జోడీ సర్వీస్‌‌ బ్రేక్‌‌ చేసిన ఇండో–-ఉక్రెయిన్‌‌ ద్వయం ఆ తర్వాత ప్రత్యర్థికి బ్రేక్‌‌ పాయింట్‌‌ ఇచ్చుకుంది.

మరోవైపు మూడో గేమ్‌‌లో సర్వీస్‌‌ కోల్పోయిన పెంగ్‌‌-–-జాంగ్‌‌ ద్వయం  వెంటనే బ్రేక్‌‌ సాధించి రేసులోకొచ్చింది. ఆరో గేమ్‌‌లో 0–30తో నిలిచిన దశలో ప్రత్యర్థి తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న మీర్జా–-కిచెనోక్‌‌ 4–2తో సెట్‌‌లో లీడ్‌‌ సాధించి వడివడిగా టైటిల్‌‌కు చేరువైంది. అయినా పోరాటం ఆపని చైనా జంట ఎనిమిదో గేమ్‌‌లో మరో బ్రేక్‌‌ పాయింట్‌‌తో 4–4తో స్కోరు సమం చేసి మ్యాచ్‌‌లో టెన్షన్‌‌ రేకెత్తించింది. ఈ దశలో ఒక్కసారిగా జోరు పెంచిన సానియా–-నదియా తొమ్మిదో గేమ్‌‌లో ప్రత్యర్థి సర్వీస్‌‌ బ్రేక్‌‌ చేసి లీడ్‌‌లోకి రావడంతోపాటు తమ సర్వీస్‌‌లో చాంపియన్‌‌షిప్‌‌ పాయింట్‌‌ సాధించింది. ఈ విజయంతో దాదాపు 9.64 లక్షల (13,580 డాలర్లు) ప్రైజ్‌‌మనీ సొంతం చేసుకున్న సానియా, కిచెనోక్‌‌ చెరో 280 ర్యాంకింగ్‌‌ పాయింట్లు కూడా అందుకున్నారు.

Sania Mirza wins Hobart International doubles title after returning from maternity break

More News: అమ్మాయిలు మనోళ్లే.. ఆడేది అమెరికా లీగ్ లో!

ఇండియా Vs ఆసీస్‌‌: నేడే ఆఖరి పోరు

Latest Updates