ఇన్సెంటివ్ ఇంకెప్పుడు ఇస్తరు సారూ?

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.5 వేల ఇన్సెంటివ్ కార్మికుల ఖాతాల్లోకి ఇప్పటికీ చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా 43,600 మంది కార్మికులు ఉండగా, సుమారు 8 వేల మందికి ఇన్సెంటివ్ అందలేదని చెబుతున్నారు. కరోనా నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న జీహెచ్ ఎంసీ, పంచాయతీ రాజ్ శానిటేషన్ సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఏప్రిల్7న ఇన్సెంటివ్ ప్రకటించారు. ఇందుకోసం రూ.21.84 కోట్ల నిధులకు పరిపాలన అనుమతి ఇస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శి ఏప్రిల్ 9న జీవో ఎంఎస్ నంబర్16ను జారీ చేశారు. అయితే, ఏప్రిల్ లో ఇన్సెంటివ్ ప్రకటిస్తే ఇంత వరకు రాలేదని వేలాది మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు ఇచ్చిన ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్లు మ్యాచ్ కాలేదని అధికారులు చెబుతున్నారు.

2011 జనాభా లెక్కలతో లింకు!

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి500 జనాభాకు ఒక కార్మికుడి చొప్పున ఉండాలన్న నిబంధన ఆధారంగా ఇన్సెంటివ్ ను అధికారులు చెల్లిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 5 నుంచి10 మంది కార్మికులు ఉండగా, ఇద్దరికే ఇన్సెంటివ్ అందిందని, మిగతా కార్మికులకు రాలేదని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు పారిశుధ్య కార్మికులు ఉండగా మిగతా వాళ్లు వాటర్ మెన్, ఎలక్ట్రీషియన్, కారోబార్, బిల్ కలెక్టర్ లుగా పని చేస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల1 నుంచి శానిటేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఈ నెల 8 వరకు జరగనున్న ఈ డ్రైవ్ లో వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నారు. అయితే సర్పంచ్ లు, కార్యదర్శులు, కార్మికులు అందరూ పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

కొందరికే ఇవ్వటం సరికాదు  

స్వీపర్లకు, పారిశుధ్య కార్మికులకు మాత్రమే ఇన్సెంటివ్ ఇస్తున్నారు. గ్రామంలో కార్మికులందరూ కొవిడ్ నివారణకు పని చేస్తున్నారు. కానీ కొంత మందికే ఇవ్వటం సరి కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో అందరికీ ఇస్తామని ఉంది. అన్ని జిల్లాల నుంచి మొత్తం కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలు పంచాయతీ రాజ్ శాఖకు పంపినం. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇన్సెంటివ్ అందరికీ వచ్చేలా చొరవ చూపాలి.

– మధుసూదన్ రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్

పొంతన లేని కారణాలు చెప్తున్నరు

ఇన్సెంటివ్ కోసం అధికారులను అడుగుతుంటే పొంతన లేని సమాధానాలు చెబుతున్నరు. లాక్ డౌన్ కదా లేట్ అని, లిస్ట్ లో పేర్లు లేవని అంటున్నరు. సీఎం అందరికీ ఇవ్వమంటే అధికారులు స్వీపర్లకు మాత్రమే ఇస్తున్నరు. ఇప్పుడు శానిటేషన్ డ్రైవ్ అంటూ కార్మికులందరి చేత పని చేపించుకుంటున్నరు. పనులు చేపించుకుంటూ ఇన్సెంటివ్ మాత్రం కొంత మందికే ఇస్తే ఎట్లా?

– సబిత, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నేత, మేడ్చల్ జిల్లా

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates