ధవన్ ప్లేసులో శాంసన్‌‌

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌‌తో వచ్చే నెల జరగబోయే టీ20 సిరీస్‌‌కు శిఖర్‌‌ ధవన్‌‌ దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడిని సిరీస్‌‌ నుంచి తప్పించినట్టు బీసీసీఐ తెలిపింది. ధవన్‌‌ ప్లేస్‌‌లో ఈ సిరీస్‌‌కు కేరళ వికెట్‌‌ కీపర్‌‌, బాట్స్‌‌మన్‌‌ సంజు శాంసన్‌‌ను సెలెక్షన్‌‌ కమిటీ ఎంపిక చేసినట్టు బుధవారం ప్రకటించింది. ‘సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నీలో భాగంగా సూరత్‌‌లో మహారాష్ట్రతో మ్యాచ్‌‌ సందర్భంగా ఢిల్లీ బ్యాట్స్‌‌మన్‌‌ ధవన్‌‌ గాయపడ్డాడు. అతని ఎడమ మోకాలిపై చర్మం లోతుగా కట్‌‌ కావడంతో కుట్లు పడ్డాయి.  అతని పరిస్థితిని బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ మంగళవారం పరిశీలించింది. కుట్లు తీసేందుకు, ఆ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరి కొంత సమయం పడుతుందని తెలిపింది. దాంతో, ఆలిండియా సెలెక్షన్‌‌ కమిటీ అతని ప్లేస్‌‌లో శాంసన్‌‌ను టీ20 సిరీస్‌‌కు సెలెక్ట్‌‌ చేసింది’ అని బోర్డు తెలిపింది. బంగ్లాతో టీ20 సిరీస్‌‌కు ఎంపికైన శాంసన్‌‌కు ఒక్క మ్యాచ్‌‌లో కూడా ఆడే చాన్స్‌‌ రాలేదు. అయినా అతడిని టీమ్‌‌ నుంచి తప్పించడంపై విమర్శలు వచ్చాయి. బంగ్లాపై ఆడించకుండానే ఎలా వేటు వేస్తారని పలువురు మాజీలు ప్రశ్నించారు. కాగా, ధవన్‌‌ విండీస్‌‌తో వన్డే సిరీస్‌‌కల్లా ఫిట్‌‌నెస్‌‌ సాధించే చాన్సుంది.

 

Latest Updates