సంక్రాంతి సినిమాల ముచ్చట్లు

డోన్ట్ ఫియర్ హీరో ఈజ్ హియర్

హీరో అంటే ఎవరు? భయమన్నదే ఎరుగనోడు. ప్రమాదానికి ఎదురెళ్లేవాడు. ఎదుటివారికి సాయం చేయడానికి ఎంతకైనా తెగించేవాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఇదే హీరోకి డెఫినిషన్. ఈ డెఫినిషన్‌‌ మారదు. మారితే సినిమా పండదు. అందుకే మన సినిమా ఇప్పటికీ హీరో చుట్టూనే తిరుగుతోంది.

ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వాటి కథల్ని పరిశీలించారా? మొదటిది ‘దర్బార్’. హీరో పోలీసాఫీసర్. ముంబైలో ముదిరిపోయిన డ్రగ్స్​ దందా, అమ్మాయిల ట్రాఫికింగ్‌‌ని అరికట్టడానికి వస్తాడు. అనుకున్నది సాధిస్తాడు. రెండోది.. ‘సరిలేరు నీకెవ్వరు’. తన తోటి సైనికుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. అతడి కుటుంబానికి అండగా ఉండటం కోసం హీరో వెళ్తాడు. అన్నీ చక్కబెట్టాకే తిరిగొస్తాడు. మూడోది.. ‘అల వైకుంఠపురములో’. ఉన్నట్టుండి హీరోకి తాను కోటీశ్వరుల ఇంటి బిడ్డనని తెలుస్తుంది. ఆ ఇంట్లో ఎన్నో సమస్యలున్నాయనీ అర్థమవుతుంది. కొడుకునని చెప్పకుండానే అక్కడ అడుగు పెడతాడు. సమస్యలన్నీ పరిష్కరించి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. ఇక నాలుగోది.. ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమాలో హీరో నిజంగానే మంచితనానికి పరాకాష్ట. తెలిసినవాళ్లకే కాదు, ఎవరికి సమస్యలున్నా అక్కడ వాలిపోతాడు. అన్నీ సరిచేసి సంతోషపెడుతుంటాడు. ఈ కథల్లో సమస్యలు వేరు, సందర్భాలు వేరు. కానీ హీరో కామన్. అతని హీరోయిజమూ కామన్.

దటీజ్ హీరో

ప్రతి సినిమా ఒక కాన్సెప్ట్‌‌ చుట్టూ తిరుగుతుంది. ఆ కాన్సెప్ట్‌‌లో కచ్చితంగా కాన్‌‌ఫ్లిక్ట్ ఉంటుంది. దాన్ని సరి చేసేవాడే హీరో. అందుకే కొందరు మా సినిమాకి కథే హీరో అని చెప్పినా.. ప్రతి కథకీ ఓ హీరో మస్ట్​గా ఉంటాడు. అతడే ఆ కథకి ఆయువు పట్టు, ఎసెట్టు. ‘క్రిష్‌‌’ సూపర్ హీరో అయ్యింది సమస్యలు పరిష్కరించడానికే. బాలయ్య ‘లెజెండ్‌‌’గా మారింది మంది మంచి కోసమే. ‘మిర్చి’లాంటి కుర్రాడి తపన కూడా జనం కోసమే. చెర్రీ ‘నాయక్’ అయినా, కార్తి ‘ఖాకీ’ తొడిగినా.. అన్నీ లోక కళ్యాణానికే. అతడి వృత్తే అందరినీ కాపాడటం కావొచ్చు. లేదా అనుకోకుండా  సమస్యలు అతని కంట పడొచ్చు. ఏదేమైనా.. పరిష్కరించడానికి అతడే రావాలి, వస్తాడు. డీజే, సింహా, నా పేరు సూర్య, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, చాణక్య, కల్కి, రాక్షసుడు లాంటి చిత్రాలన్నీ సమస్యల చుట్టూ తిరుగుతుంటే.. వాటిని పరిష్కరించడానికి హీరో విలన్‌‌ చుట్టూ తిరుగుతుంటాడు.  ఎందుకంటే హీరో అనేవాడు అందరిలోనూ ఉండాలి. అందరి కోసం బతకాలి. బతుకు
తాడు. దటీజ్​ హీరో.

ఫ్యామిలీ హీరోస్​

హీరో కూడా మనిషే. అతనికీ స్వార్థం ఉంటుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన ఉంటుంది. ఈ ఆలోచనతోనే దర్శకులు హీరోల ఫ్యామిలీస్‌‌లోనే సమస్యలు సృష్టిస్తుంటారు. ‘అల వైకుంఠపురములో’ మాదిరిగా. దీనికి మరీ పర్‌‌‌‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే.. ‘దృశ్యం’. మలయాళంలో మోహన్‌‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. తర్వాత తమిళ, తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యి భారీ విజయాన్ని సాధించింది. అన్నిచోట్లా మంచి ఫలితాన్నే అందుకోవడానికి కారణం.. ఫ్యామిలీ సెంటిమెంట్. అనుకోకుండా పెద్ద ప్రమాదంలో పడిన తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో పడిన తపన,  పన్నిన వ్యూహాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ‘ప్రతిరోజూ పండగే’లో సత్యరాజ్‌‌కి క్యాన్సర్‌‌‌‌ అని సడెన్‌‌గా తెలుస్తుంది. కానీ కొడుకులు, కూతుళ్లు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి పట్టించుకోరు. మనవడు సాయిధరమ్‌‌ తేజ్ మాత్రం తాత దగ్గర క్షణాల్లో వాలిపోతాడు. చనిపోయేవరకు ఆయన జీవితం పండగలా గడిచేలా ప్లాన్ చేస్తాడు. అందరినీ మార్చి తాత దగ్గర చేర్చుతాడు. ‘శతమానం భవతి’లో శర్వానంద్ చేసేది కూడా దాదాపు ఇంతే. పిల్లల కోసం ఆరాటపడుతున్న తన గ్రాండ్ పేరెంట్స్‌‌ని సంతోష పెట్టడం కోసం పెద్ద స్కెచ్చే వేస్తాడు. తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై ‘కేశవ’ కూడా పెద్ద యుద్ధమే చేస్తాడు. ఇలా అప్పుడప్పుడూ హీరోలు తమ ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్‌‌ మీద కూడా కాన్సన్‌‌ట్రేట్ చేస్తారు. వాటిని సాల్వ్ చేసే క్రమంలో మిగతా వారందరికీ మంచి మెసేజ్ ఇస్తుంటారు.

యాక్సిడెంటల్ హీరోస్​

ఒక్కోసారి సినిమాల్లో హీరోలు తమ బతుకేదో తాము బతికేస్తుంటారు. కానీ ఉన్నట్టుండి వారి జీవితం మరో మలుపు తిరుగుతుంది. అతడి లక్ష్యం మారిపోతుంది. సమస్యల దారిలో సాగాల్సి వస్తుంది. వాటిని పరిష్కరించడం కోసం పోరాడాల్సి వస్తుంది. అక్కడ్నుంచి కథ వేరే రంగు పులుముకుంటుంది. ‘మహర్షి’లో మహేష్‌‌బాబుకి తాను గొప్పవాడవడమే లక్ష్యం. తీరా అయ్యాక తన స్నేహితుడి కోసం ఒక ఊరి సమస్యను నెత్తినేసుకుంటాడు. అది కాస్తా రైతుల సమస్యలు తీర్చడానికి అతణ్ని పురికొల్పుతుంది. అంతకుముందు ‘శ్రీమంతుడు’లో కూడా ప్రేమించిన అమ్మాయి కోసం, తన తండ్రి కోసం ఓ ఊరినే దత్తత చేసుకున్నాడు. ‘కేజీఎఫ్‌‌’లో యశ్‌‌ ఎవరినో చంపడానికి ‘ఎల్​ డొరాడో’కి వెళ్తాడు. కానీ అక్కడి బానిసల పాలిట దేవుడవుతాడు. పర్యావరణం కోసం పాటుపడే తారక్‌‌ ‘జనతా గ్యారేజీ’ పగ్గాలు చేపట్టాడు. తన సుఖం మాత్రమే చూసుకునే ‘జాలీ ఎల్‌‌ఎల్‌‌బీ’ ఓ అమ్మాయికి న్యాయం చేయడం కోసం టెర్రరిస్టులతోనే తలపడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె సమస్యలనే తన సమస్యలనుకుని ప్రాణాలే వదిలాడు ఇమ్రాన్ హష్మి ‘హమారీ అధూరీ కహానీ’లో. తనలా ఉన్నవాడిని అడ్డుపెట్టుకుని డబ్బు కొట్టేయాలనుకున్నా, అతడి కథ తెలిసి పెద్ద త్యాగానికే సిద్ధపడ్డాడు మెగాస్టార్ ‘ఖైదీ నంబర్ 150’లో. తనకు జరిగిన నష్టానికి కారణాన్ని తెలుసుకునే క్రమంలో పెద్ద ర్యాకెట్‌‌నే బైటికి లాగిన ‘అభిమన్యుడు.. గ్యాంగ్‌‌ రేప్‌‌కి గురైన అమ్మాయికి న్యాయం చేయడానికి గన్ పట్టిన ‘డాక్టర్ సలీమ్’, ఐదుగురు ఆడవాళ్లకు సాయం చేయాలనుకున్న ‘గ్యాంగ్ లీడర్‌‌‌‌’, తన కూతురిని వెతికే క్రమంలో ఎంతోమంది అమ్మాయిల్ని వేశ్యావాటికల నుంచి కాపాడిన ‘శివాయ్’, తనపై నిందను తుడిపేసుకునే క్రమంలో ఎందరో యువతీ యువకుల భవిష్యత్తును కాపాడిన ‘అర్జున్ సురవరం’.. వీళ్లందరూ అనుకోకుండా ఆ సమస్యలోకి అడుగుపెట్టినవారే. ఆ సమస్య అంతు చూసినవారే.

రూటు మార్చినా..

అప్పుడప్పుడూ తెలుగు సినిమా రూటు మార్చడమూ జరుగుతోంది. హీరోల స్థానంలో హీరోయిన్లు చక్రం తిప్పుతూ ఉంటారు. చేయాల్సినవన్నీ వాళ్లే చేస్తుంటారు. ‘కర్తవ్యం’లో నయనతార కలెక్టర్. కాబట్టి ఆమే సమస్యని పరిష్కరిస్తుంది. ‘భాగమతి’లో అనుష్క కూడా అంతే. ‘కహానీ’లో విద్యాబాలన్ తన ఇంటి సమస్యతో పాటు దేశ సమస్యను కూడా తీర్చేందుకు నడుం కట్టింది. ‘రాట్చసి’లో జ్యోతిక గవర్నమెంట్ స్కూల్స్‌‌ని బాగు చేసింది. ‘నో ఒన్‌‌ కిల్డ్‌‌ జెస్సికా’లో రాణీ ముఖర్జీ, ‘యు టర్న్​’లో సమంత.. ఇలా అందరూ రకరకాల సమస్యలతో పోరాడి హీరోలను మించి సత్తా చాటారు. కాకపోతే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక్కోసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో సైతం హీరోయిన్ వెనుక హీరో ఉంటాడు. ఆమెను వెనకుండి నడిపిస్తుంటాడు. ‘వాసుకి’లో మమ్ముట్టిలా.

చివరిగా చెప్పేదేమిటంటే.. ఆఫీసును నడపడానికి బాస్ కావాలి. కుటుంబాన్ని నడపడానికి ఓ పెద్ద కావాలి. కథను నడపడానికి హీరో కావాలి. అందుకే మన సినిమాలు హీరో చుట్టూ తిరుగుతాయి. సమస్య ఏదైనా.. డోన్ట్ ఫియర్, అయామ్‌‌ హియర్‌‌‌‌ అంటూ అతడు తెరపై ప్రత్యక్షమవగానే విజిల్స్ పడతాయి. అలాగని కథ పేలవంగా ఉందో.. హీరో ఎంత మెస్మరైజ్ చేయాలని చూసినా నెగిటివ్ కామెంట్స్ వచ్చి పడతాయి. అదీ సంగతి!

For More News..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

దునియా ఆస్తి రూ.256.18 కోట్ల కోట్లు

Latest Updates