టీజర్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’

హీరో మహేష్ బాబు, దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ బాబుకు ఇది 26వ సినిమా. ఈ సినిమాను జీఎంబీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, రష్మికా మందన్న హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ నిన్న విడుదలయింది. విడుదలయిన 9 నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ సినిమా టీజర్.. అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ రాబట్టిన టీజర్‌గా యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో నిన్నటి నుంచి ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ 24 గంటల్లో 15 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలచేయబోతున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి 2018 సంక్రాంతికి ‘ఎఫ్2’ సినిమాతో వచ్చి మంచి హిట్ దక్కించుకున్నారు. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఆయనకు ఎటువంటి హిట్‌ను అందిస్తుందో చూడాలి. అనీల్ గత చిత్రాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలను గమనిస్తే.. కచ్చితంగా ఈసారి కూడా అనీల్ మరో హిట్ కొడతారనే సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాలో విజయశాంతి ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్, సంగీత, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

Latest Updates