బైపోల్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తాం: సర్పంచుల సంఘం

  • అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని పరిశీలిస్తామన్న సర్పంచుల సంఘం
  • జాయింట్ చెక్ పవర్ తొలగించాలని డిమాండ్
  • అక్టోబర్ 2న గాంధీ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ
  • పోరాటానికి అండగా నిలుస్తామని నేతల హామ

హైదరాబాద్ , వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లోపు జాయింట్ చెక్ పవర్ తొలగించకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తామని సర్పంచ్ ల సంఘం హెచ్చరించింది. సంఘం తరఫున అభ్యర్థిని బరిలో దింపే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది. చెక్ పవర్ తొలగించేవరకు తమ ఉద్యమం ఆపబోమని స్పష్టం చేసింది. గురువారం కాచిగూడలోని ఓ హోటల్ లో “రాష్ట్రంలో సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్ కార్యాచరణ”అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, లోక్ సత్తా పార్టీ నేత శ్రీనివాస్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్చంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ మాట్లాడుతూ..  “73వ  రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 29 అధికారాలను సర్పంచ్ లకు బదిలీ చేయాలి. జాయింట్ చెక్ పవర్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వెంటనే తొలగించాలి. ఎన్నికలు జరిగి 8 నెలలు గడుస్తున్నా ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. కొత్త పంచాయతీలు అద్దె కార్యాలయాల్లోనే కొనసాగుతున్నాయి. కార్మికులకు రూ.8,500 జీతాలపై స్పష్టత ఇవ్వాలి”అని డిమాండ్ చేశారు.

సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ మాట్లాడుతూ..  గద్వాల నియోజకవర్గంలో సర్పంచ్ మూడు రోజులు లేకపోతే ఉప సర్పంచ్ వచ్చి అధికారం చెలాయిస్తున్నాడన్నారు. అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అచితూచి మాట్లాడాలని సూచించారు.  యాక్షన్ ప్లాన్ లో పనిచేయనివారికి బిరుదులు ఇస్తామంటున్నారని, చెత్త బుట్టలతో సన్మానం చేస్తారని చెబుతున్నారని గుర్తు చేశారు. సర్పంచ్ లు పిలుపునిస్తే ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో అడుగుపెట్టలేరని హెచ్చరించారు. అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.- వచ్చే నెల 5 లోపు సర్పంచ్ లతో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

పోరాటానికి అండగా నిలుస్తాం: కోదండరాం

సర్పంచ్ ల డిమాండ్లు న్యాయసమ్మతమేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్  కోదండరాం అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం చేయాలని, మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.”సర్పంచ్ లు ఐక్యంగా పోరాడాలి. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు కూడా జరగుతాయి. సంఘం మీద చెడు ప్రచారం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. హామీ లు ఇస్తే నమ్మకండి. ఆచరణలోకి వచ్చే దాకా పోరాడాలి” అని సూచించారు.  సర్పంచ్, ఉపసర్పంచ్ ల మధ్య గొడవలు పెట్టడానికే సీఎం కేసీఆర్ జాయింట్ చెక్ పవర్ ఇచ్చారని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. చెట్టు ఎండిపోతే సర్పంచ్ లను తొలగిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని, ఆయనకు ఆ అధికారం లేదన్నారు. సర్పంచ్ లు తలుచుకుంటే సీఎం దిగివస్తడన్నారు.

“పంచాయతీలకు గత ఐదేళ్లలో ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృధ్ది కార్యక్రమాలు జరిగాయి. అప్పులు చేసి సర్పంచ్ లు పనులు చేసినా ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. సర్పంచ్ ల సమస్యలు పరిష్కారం కాకపోతే ఢిల్లీ తీసుకెళ్లే బాధ్యత నాదే” అని హామీ ఇచ్చారు.  సర్పంచ్, ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జాగీరులా కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్రం నుంచి డైరెక్ట్ గా వచ్చే నిధులను ఆపి సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు.  సర్పంచ్ ల సమస్యలపై  రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రిని కలుద్దామన్నారు. కేసీఆర్ మెడలు వంచాలంటే సర్పంచ్ లతోనే సాధ్యమని చెప్పారు. సర్పంచ్ లకు ఐదు వేలు, కార్మికులకు ఎనిమిదిన్నర వేల వేతనమా అని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సర్పంచ్ జీతం తీసుకోవాలన్నా ఉప సర్పంచ్ సంతకం పెట్టే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలోనే ఉందన్నారు. సర్పంచ్ ల వేతనాన్ని రూ.20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

500 మంది నామినేషన్?

హుజూర్ నగర్ లో 500 మంది సర్పంచ్ లు నామినేషన్లు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం ముగిశాక ప్రతిపాదించారు. సర్పంచ్ లూ అంగీకారం తెలిపారు. అయితే సర్చంచ్ ల సంఘం వ్యవస్ధాపక అధ్యక్షుడు జోక్యం చేసుకుని త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Sarpanch community has warned that will defeat the TRS in the by-elections

Latest Updates