తాడోపేడో: సర్కారుకు సర్పంచ్ ల సంఘం అల్టిమేటం

‘వచ్చె నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నాటికి జాయింట్ చెక్ పవర్ తొలగించాల్సిందే. లేకపోతే తాడో పేడో తేల్చుకుంటాం. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం. సర్పంచ్​ పదవులకు మూకుమ్మడి రాజీనామాల చేసేందుకు కూడా వెనుకాడబోం”అని రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ ల సంఘం నేతలు సర్కారుకు అల్టిమేటం ఇచ్చారు. పదవులు చేపట్టి ఆరు నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయలేదని, 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలను కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏందని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుంటారు. మరి గ్రామాలపై రాష్ట్రం పెత్తనమేంది. మా పన్నులు తీసుకుని మాకు నిధులు ఇవ్వకుండా ఆపడం ఏంది. నిత్యం సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామని బెదిరించటం ఏంది. ఏడాది నుంచి గ్రామాల్లో అభివృద్ధి జరగకపోవడంతో పంచాయతీలు నిర్వీర్యమయ్యే స్టేజ్ కు చేరాయి”అని ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం హైదరాబాద్​లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ ల సంఘం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ల సమస్యలపై 20 రోజుల క్రితం సీఎంను కలిశామని, పరిష్కారానికి కొంత సమయం అడిగారని, ఇంత వరకు అడుగు ముందుకు పడలేదని చెప్పారు.

అవసరమైతే చలో ఢిల్లీ

జాయింట్ చెక్ పవర్ ను తొలగించాల్సిందే అని భూమన్న యాదవ్​ డిమాండ్ చేశారు. బడ్జెట్​ సమావేశాల నాటికి తమ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ, 14వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా అడ్డుకోవటం ఏమిటని, పంచాయతీలకు నేరుగా వచ్చే కేంద్ర నిధులపై రాష్ట్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిని కలుస్తామన్నారు. చెక్ పవర్ తొలగించే వరకు సర్పంచ్ లు అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన కోరారు.

కరెంట్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి

తమ సమస్యలపై నెలాఖరు వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత తాడోపేడో తేల్చుకుంటామని సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి హెచ్చరించారు. పంచాయతీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు విడుదల చేయాలని, సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలన్నారు. సమస్యలు పరిష్కరిస్తారని ప్రజాప్రతినిధులపై ఆశలు పెట్టుకోవద్దని సంఘం ఉపాధ్యక్షుడు యాదన్న యాదవ్ సూచించారు. తాము పార్టీ గుర్తుతో గెలవలేదని, తమకు గౌరవం లేని పార్టీలో ఎందుకుండాలని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అవసరమైతే సర్పంచ్ లు అందరూ మూకుమ్మడి రాజీనామలు చేసేందుకు వెనుకాడబోరని తేల్చిచెప్పారు.

గ్రూపులను పెంచేలా జాయింట్​ చెక్​పవర్​

పంచాయతీల్లో గ్రూపులను పెంచేలా జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చారని సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఆరోపించారు. చాలాచోట్ల సర్పంచ్ లతో ఉప సర్పంచ్ లు వాగ్వాదాలకు దిగుతున్నారన్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలోని కన్నాల గ్రామంలో సర్పంచ్ పై ఉప సర్పంచ్ దాడి చేశారని, కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. మహిళ విభాగం అధ్యక్షురాలు జూలూరి ధనలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సర్పంచ్ లు ఉన్నారని, ఇక్కడ ఉప సర్పంచ్ ల వల్ల వివాదాలు తలెత్తుతున్నాయని, సర్పంచ్ లను ఉప సర్పంచ్ లు అవమానపరుస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు కూడా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర కార్యవర్గం ప్రమాణం

రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ ల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైంది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా సౌధాని భూమన్న యాదవ్, అధ్యక్షుడిగా గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాలకొండ ప్రణీల్ చందర్, మహిళా అధ్యక్షురాలిగా జూలూరి ధనలక్ష్మీ, కోశాధికారిగా భీమ సునీతను ఎన్నుకున్నారు. వీరితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు సంయుక్త కార్యదర్శులు, ఒక అధికార ప్రతినిధి, ముగ్గురు ముఖ్య సలహాదారులను ప్రకటించారు. వీరంతా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

https://epaper.v6velugu.com/2296457/V6-Prabhatha-Velugu-Telugu-Daily-Newspaper/23-08-19#page/1/1

Latest Updates