కొప్పుల సభ వద్ద లొల్లి లొల్లి.. మర్లవడ్డ సర్పంచ్​లు

sarpanchs-boycotted-the-meeting-of-minister-koppula-eeshwar

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమావేశాన్ని సర్పంచ్‌లు బహిష్కరించారు. మాకే తాగేందుకు నీళ్లు లేవు.. హరితహారం మొక్కలు ఎండిపోతే మమ్మల్ని బాధ్యులు చేయడమేంటని.. ఉమ్మడి చెక్‌పవర్‌ను రద్దు చేయాలని ధర్నాకు దిగారు. దీంతో మంత్రి కొప్పుల మీటింగ్​కు రాకుండా మూడు గంటల పాటు తన క్యాంప్​ ఆఫీస్‌లోనే వెయిట్‌ చేశారు. ఆందోళనకు దిగిన సర్పంచ్‌లను అరెస్ట్‌ చేసిన తరువాత వచ్చి అరగంటలో ప్రోగ్రామ్‌ ముగించుకొని వెళ్లారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వచ్ఛ హరితమిషన్‌పై మంగళవారం సర్పంచ్‌లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆహ్వానించారు. హరితహారం మొక్కలు ఎండిపోతే తమను బాధ్యులను చేయడం, ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్‌ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. దీనికి నిరసనగా 80 మంది సర్పంచ్‌లు సదస్సును బహిష్కరించారు. వారిలో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్పంచ్​లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు.

మా ప్రభుత్వంలో మాకే దిక్కులేని పరిస్థితి ఉందని టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు వాపోయారు. మా హక్కులు కాలరాస్తూ పంచాయతీరాజ్ చట్టంలో ఉపసర్పంచ్‌తో కలిపి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారన్నారు. ఉమ్మడి చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగడానికి నీళ్లే లేవు..  హరితహారంలో నాటిన మొక్కల్లో 85 శాతం ఎండిపోతే సర్పంచ్‌లను తొలగిస్తామనడం సరికాదన్నారు. గ్రామాల్లో నిధులు వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికై ఆరు నెలలు గడిచినా గ్రామల్లో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సర్పంచ్‌ల హక్కులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడు గంటల పాటు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. కలెక్టర్‌ శరత్​ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఆందోళనకు దిగిన 80 మంది సర్పంచుల్లో పది పదిహేను మంది మినహా మిగతా అంతా టీఆర్‌ఎస్ వారే కావడంతో పోలీసులు ఒకింత వెనుకడుగు వేశారు. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో వారిని అరెస్ట్​ చేసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Latest Updates