మోడీ ఇంటర్వ్యూపై సెటైర్లే సెటైర్లు

మోడీ ఇంటర్వ్యూపై సెటైర్లే సెటైర్లు బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్ కు ప్రధానినరేంద్ర మోడీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ‘‘ఎన్నికల వేళ నాన్ పొలిటికల్ ప్రశ్నలడిగి నన్ను రిలాక్స్ చేసినందుకు థాంక్స్ ”అంటూ మోడీ తన ప్రోగ్రామ్ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పినా ట్రోలింగ్ ఆగలేదు. ‘‘నేరుగా మీడియా గొంతు నొక్కడం కంటే, జర్నలిస్ట్​ కానివాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుడే మేలని ప్రధాని భావిస్తుండొచ్చు’’అని కొందరు పాత్రికేయులంటే,‘‘దమ్మున్న జర్నలిస్టులతో మాట్లాడే సాహసం చేయగలరా?’’ అన్నది సామాన్యుల నుంచి వ్యక్తమైన ప్రశ్న. ఇంటర్వ్యూలో అక్షయ్​ అడిగిన ప్రశ్నలు చాలా సిల్లీగా ఉన్నాయని, బహుశా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఇదో స్మార్ట్​ స్ట్రాటజీ అయ్యుంటుందేమోనంటూ ట్రోలర్లు చెలరేగిపోయారు.

ప్రధాని హోదాలో ఐదేండ్లుగా ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని మోడీ, ఎన్నికల ప్రకటన తర్వాత పలు న్యూస్ చానెళ్లకు వన్టు వన్ ఇంటర్వ్యూలిచ్చారు. అవన్నీ ‘ముందే ప్రిపేర్చేసిన’ ప్రశ్నలు కావడం అటుంచితే, ఇంటర్వు చేసేవాళ్లు మోడీని పొగడ్తలతో ముంచెత్తడం నవ్వులాటకు దారితీయడం తెలిసిందే. అయితే, బుధవారం ప్రసారమైన‘నాన్ పొలిటికల్ ’ ఇంటర్వ్యూపై మోడీ స్ట్రాటజిస్టులు భారీ కసరత్తు చేసినట్లు చర్చ నడుస్తున్నది.

ఏ ఒక్క చానెల్ కో ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా వచ్చే కవరేజ్ కంటే, ఏకంగా (ఏఎన్ ఐ)న్యూస్ఏజెన్సీ ద్వారా వీడియోని రిలీజ్ చేయడం ద్వారా అన్ని చానెళ్లు, పత్రికలు అనివార్యంగా నైనా కవర్ చేస్తాయన్నది ప్రధాన ఉద్దేశంగా కనబడుతున్నదని విశ్లేషకుల కామెంట్. సీనియర్ జర్నలిస్ట్​ బిక్రమ్  వోరా మరో అడుగు ముందుకేసి, పెద్ద నాయకుల్నిఫిలిం స్టార్లు ఇంటర్వ్యూలు చేస్తే, ఇక జర్నలిస్టులేంచేయాలని ప్రశ్నించారు. ‘‘వందల మంది జర్నలిస్టుల్ని కాదని, మన ప్రధాని ఒక నటుణ్ని ఎంచుకోవడం ఫోర్త్​ ఎస్టేట్ ( మీడియా)కు జరిగిన అవమానంగా భావిస్తున్నా. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్​ కూడా మీడియాను శత్రువుగా చూస్తారు. ఇటీవలవైట్ హౌజ్, సీఎన్ ఎన్ రిపోర్టర్ ని బ్యాన్ చేయడం అందుకో ఉదాహరణ. వ్యతిరేక ప్రచారం ఎంత పెద్దస్థాయిలో జరిగినా, ట్రంప్​ ఇప్పటిదాకా జర్నలిస్టు కానివాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అయితే, సంప్రదాయాన్ని బ్రేక్ చేయడం ద్వారా మోడీ కొత్త ఒరవడి సృష్టించారు. తద్వారా తాను అనుకున్నది మాత్రమే చెబుతాను తప్ప, ఇతర ప్రశ్నలకు తావివ్వనని క్లారిటీ ఇచ్చారు”అంటూ వోరా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో వేషాల కోసమే!
‘ప్రత్యేక ఇంటర్వ్యూ’లో అక్షయ్​ కంటే బెటర్ యాక్టర్నని నిరూపించుకోడానికి మోడీ తాపత్రయపడ్డారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఐదేండ్ల పాలనలో ఎలాగూ ఫెయిలయ్యారు. మే23 తర్వాత పీఎం పదవి ఊడటం ఖాయమైంది. అందుకే బాలీవుడ్​లో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వెతుక్కుంటున్నారు. మా లెక్క ప్రకారం పాలిటిక్స్ లాగే బాలీవుడ్​లో నూ మోడీకి పరాభవం తప్పదు. అక్షయ్​ కుమార్ మాత్రం మంచి నటుడిగా నిలిచిపోతారు”అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా అన్నారు. సినీరంగానికి చెందిన కొందరు ప్రముఖులు కూడా సెటైర్లు వేశారు. ఇంటర్వ్యూను సినిమాతో పోల్చుతూ, విలన్ గా అక్షయ్​ని తక్కువచేసి చూపారంటూ హీరో సిద్ధార్థ్​ ట్వీట్ చేశారు. ‘మోడీ దేశానికి స్వాతంత్ర్యం తెప్పించిన సీన్ లేదే!’అని గతంలో ‘ది మోడీ’ బయోపిక్ ట్రైలర్ పైనా సిద్దూ సెటైర్లు వేయడం తెలిసిందే.

Latest Updates