తొలి ఇండియన్‌… డోప్‌ టెస్టులో ఫెయిల్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌కు ఎంపికైన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన సత్నామ్‌ సింగ్‌ భమార డోప్‌ టెస్టులో ఫెయిలయ్యాడు. దాంతో, నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) అతడిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌‌ ప్రిపరేటరీ కాంప్‌ సందర్భంగా నాడా గత నెలలో నిర్వహించిన డోప్‌ టెస్టులో సత్నామ్‌ పట్టుబడ్డాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల యువ ప్లేయర్‌ శాంపిల్లో గుర్తు తెలియని నిషేధక ఉత్ప్రేరకం లభించింది. దాంతో, గత నెల 19న అతడిని తాత్కాలికంగా సస్పెం డ్‌ చేసినట్టు నాడా తెలిపింది.

అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని సత్నామ్‌ సింగ్‌ అంటున్నాడు. తనపై మోపిన అభియోగాలను పంజాబ్‌ యంగ్‌ స్టర్‌ సవాల్‌ చేశాడు. ఈ కేసులో యాంటీ డోపింగ్‌ డిసిప్లినరీ ప్యానెల్‌ (ఏడీడీపీ)తో విచారణ చేపట్టి, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నాడాను రిక్వెస్ట్‌‌ చేసినట్టు తెలిపాడు. అయితే, తన బి-శాంపిల్‌ను పరీక్షించాలని సత్నామ్‌ డిమాండ్‌ చేశాడో లేదో తెలియడం లేదు. ఒకవేళ సత్నామ్‌ డోపింగ్‌కు పాల్పడినట్టు ఏడీడీపీ విచారణలో తేలితే అతనిపై కనీసం నాలుగేళ్ల బ్యాన్‌ పడుతుంది. 2015లో ఎన్‌బీఏ డ్రాఫ్ట్‌‌లోకి వచ్చిన సత్నామ్‌ను డల్లాస్‌‌ మావెరిక్స్‌‌ టీమ్‌ ఎంచుకుంది. వ్యక్తిగత కారణాలతో సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌‌కు దూరంగా ఉన్న అతను ఏషియన్‌ చాంపియన్‌ షిప్స్‌‌, కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌, వరల్డ్‌‌కప్‌ క్వాలిఫయర్స్‌‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

Latest Updates