మరణశిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా

తప్పుచేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించే సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. బాల నేరస్థులకు మరణశిక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదలచేసింది. బాల్యంలో నేరానికి పాల్పడిన బాలిక లేదా బాలుడు ఇకనుంచి మరణశిక్షను ఎదుర్కోలేరని ప్రకటించింది.

‘మరింత ఆధునిక శిక్షాస్మృతిని స్థాపించడంలో ఈ నిర్ణయం మాకు సహాయపడుతుంది. విజన్ 2030లో భాగంగా దేశంలోని అన్ని రంగాలలో కీలకమైన సంస్కరణలను రూపొందించడానికి దేశ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో ఈ నిర్ణయంతో తెలుస్తుంది. దీనినంతటిని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ నేరుగా పర్యవేక్షిస్తారు’ అని సౌదీ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవద్ అలవాద్ సోమవారం అన్నారు.

‘మానవ హక్కుల సంస్కరణల్లో భాగంగా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మరియు అతని కుమారుడు క్రౌన్ ప్రిన్స్ తప్పుచేసిన వారిని కొరడాతో కొట్టడాన్ని కూడా శనివారం రద్దు చేశారు. అది చేసిన మరుసటి రోజే బాలనేరస్థులకు మరణశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మరిన్ని సంస్కరణలు అమలులోకి వస్తాయి’ అని అవద్ అలవాద్ అన్నారు.

ఈ కీలక నిర్ణయాలతో సౌదీ అరేబియా ఎలా పనిచేస్తుందో తెలిసిపోతుందని అలవాద్ అన్నారు. విజన్ 2030లో ఉన్న సంస్కరణల ద్వారా సల్మాన్ రాజు మరియు క్రౌన్ ప్రిన్స్ నాయకత్వంలో దేశ ప్రజలందరూ మెరుగైన జీవన నాణ్యతను పొందుతారని విశ్వసిస్తున్నట్లు అలవాద్ తెలిపారు.

Latest Updates