2 నెల‌ల త‌ర్వాత‌ సౌదీలో మ‌సీదులు ఓపెన్.. జూలైలో జ‌ర‌గాల్సిన హ‌జ్ యాత్ర‌పై..

ముస్లింల‌కు అతి ప‌విత్ర ప్రార్థ‌నా స్థ‌ల‌మైన మక్కా నెల‌వై ఉన్న సౌదీ అరేబియాలో దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత మ‌సీదులు తెరుచుకున్నాయి. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా మ‌త పెద్ద‌లు, మౌలానాల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ప్రార్థ‌నా స్థ‌లాల‌ను తిరిగి భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పించేందుకు ఆ దేశ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆదివారం సౌదీ రాజ‌ధాని రియాద్ లో అనేక మ‌సీదుల్లో సామాన్యులు క‌నిపించారు. ప‌రిమిత సంఖ్య‌లో సోష‌ల్ డిస్టెన్స్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ మ‌సీదులో మ‌ళ్లీ ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు అనుమ‌తించిన‌ట్లు చెప్పారు అల్ ర‌ఝీ మ‌సీదు మౌలానా అబ్దుల్ మ‌జీద్ అల్ మోహైసెన్. ఈ రోజు ఉద‌యం అల్లా ద‌య‌తో భ‌క్తుల‌ను తిరిగి మ‌సీదులో ప్రార్థ‌న‌ల‌కు ఆహ్వానించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారాయ‌న‌. ఫేస్ మాస్కు లేకుండా ఎవ‌రూ రావొద్ద‌ని, 15ఏళ్ల‌లోపు పిల్ల‌లు, 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు ప్రార్థ‌న‌లు ఇంట్లోనే ఉండి చేసుకోవాల‌ని సూచించారు. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ‌కుండా కాపాడుకునేందుకు మ‌సీదులో క‌నీసం రెండు మీట‌ర్ల దూరం పాటిస్తూ ప్రార్థ‌న‌లు చేయాల‌ని, ఎవ‌రి మ్యాట్ వాళ్లే తెచ్చుకోవాల‌ని చెప్పారు. అలాగే ఇంటి ద‌గ్గ‌రే కాళ్లు, చేతులు క‌డుక్కుని రావాల‌ని, మ‌సీదులు ఎవ‌రూ కౌగిలించుకోవ‌డం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవ‌డం చేయ‌కూడ‌ద‌ని చెప్పారు.

దాదాపు మూడు కోట్ల‌కు పైగా జ‌నాభా ఉన్న సౌదీలో ఇప్ప‌టి వ‌ర‌కు 83,384 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో 480 మంది మ‌ర‌ణించ‌గా.. 58,883 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 24,021 మంది చికిత్స పొందుతున్నాయి. అయితే క‌రోనా లాక్ డౌన్ ను మూడు ద‌శ‌ల్లో జూన్ 21 క‌ల్లా ఎత్తేయాల‌ని ఆ దేశం నిర్ణ‌యించిన‌ట్లు ఇటీవ‌లే సౌదీ అధికార వ‌ర్గాలు తెలిపాయి. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాక‌పోవడంతో ఇప్పుడే మ‌క్కాకు ఇత‌ర ప్రాంతాల భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేమ‌ని చెప్పాయి. ప్ర‌పంచ దేశాల నుంచి దాదాపు కోటి మందికి పైగా వ‌చ్చే హ‌జ్ యాత్ర విష‌యంలో ఇప్పుడే నిర్ణ‌యం తీసుకోలేమ‌ని చెబుతున్నాయి. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే జూలై 28 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు జ‌రిగే హ‌జ్ యాత్ర‌ను నిలిపేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Latest Updates