డెవలప్​మెంట్ గురించి చెప్పుడే కానీ చేస్తలేరు!

భద్రాద్రి మాస్టర్ ప్లాన్ ఎటూ తేల్చలే

ఇప్పుడు ప్రసాద్ స్కీం అమలు చేస్తమంటున్నరు

భద్రాచలం, వెలుగు: ఎన్నికోట్లు ఖర్చయినా సరే భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేసి తీరతామంటూ 2015 మార్చి 28న మణుగూరులో సీఎం కేసీఆర్​ అన్నారు. 2017–18 బడ్జెట్‍లో  రూ.100 కోట్లు సైతం కేటాయించారు. మాస్టర్​ప్లాన్‍ అమలు, గోదావరి తీరంలో అతిపెద్ద రామస్తూపం, వేయికాళ్ల మండపం, ప్రాకారాలు కట్టాలని నిర్ణయించారు. ఆరేండ్లు కావస్తున్నా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. మాస్టర్​ప్లాన్​ను పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా ప్రసాద్​ స్కీమ్​ కింద రూ. 50 కోట్లతో డెవలప్​చేస్తామని పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భద్రాద్రి అభివృద్ధిపై గతంలో సర్కారు చెప్పినవన్నీ ఉత్తి మాటలేనని అర్థమవుతోంది.

‘స్వదేశీ దర్శన్’కు డీపీఆర్​ ఇయ్యలే..

భద్రాద్రిని డెవలప్‍ చేస్తామంటూ మూడేళ్ల క్రితం చినజీయర్‍స్వామి, ఆనందసాయిని పంపించి మాస్టర్‍ప్లాన్‍ పేరుతో నానా హడావుడి చేశారు. ఏళ్లు గడిచినా మాస్టర్‍ప్లాన్‍ అమలు కాలేదు. ఈలోగా 2017లో సెంట్రల్‍ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్​మెంట్​రామాయణం సర్క్యూట్ స్వదేశీ దర్శన్‍ పేరుతో ఒక స్కీం ప్రవేశపెట్టింది. దేశంలో రామాయణంతో ముడిపడి ఉన్న 6 రాష్ట్రాలు, 11 ప్రాంతాల్లో రూ.500 కోట్లతో డెవలప్‍మెంట్‍కు యాక్షన్‍ ప్లాన్ రెడీ చేసి స్టేట్ గవర్నమెంట్లకు పంపింది. ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్య, నందిగ్రాం, సింగవరపూర్, చిత్రకూట్‍, బీహార్‍లోని సీతమర్రి, దర్భంగా, చత్తీస్‍గఢ్‍లోని జగదల్‍పూర్‍, తెలంగాణలోని భద్రాచలం, కర్నాటకలోని హంపి, తమిళనాడులోని రామేశ్వరం, మధ్యప్రదేశ్‍లోని చిత్రకూట్‍, మహారాష్ట్రలోని నాసిక్‍, నాగ్‍పూర్‍, ఒడిశాలోని మహేంద్రగిరి…ఇలా పలు ప్రాంతాలను డెవలప్‍ చేయాలని నిర్ణయించింది. అప్పుడే భద్రాచలానికి సుమారు రూ.30 కోట్లను కేటాయించి  ప్రపోజల్స్, డీపీఆర్‍ అడిగింది. కానీ అప్పుడు డీపీఆర్‍ కూడా ఇవ్వలేదు. అప్పుడే ఇచ్చివుంటే కొంత డెవలప్‍మెంట్‍ జరిగేది. భద్రాచలంలో మాస్టర్​ప్లాన్​అమలుపైనా సర్కారు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు ఇటీవల భద్రాచలంలో రామాలయం అభివృద్ధి చేయాలంటే భూమి లేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ భద్రాచలం రామాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ స్టేట్‍మెంట్ ఇచ్చారు. ఆ బాధ్యతను జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‍కుమార్‍కు అప్పగించారు.

ఇప్పుడు ప్రసాద్​ స్కీంపై దృష్టి

పిలిగ్రిమేజ్​ రిజువనేషన్​ అండ్​ స్పిర్చుయాలిటీ అగ్​మెంటేషన్​డ్రైవ్​(ప్రసాద్) సెంట్రల్​ గవర్నమెంట్​స్కీం కింద ప్రస్తుతం భద్రాచలం రామాలయాన్ని డెవలప్​చేస్తామని చెబుతున్నారు. ఈ స్కీం కింద ఇప్పటికే రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍ తన సొంత జిల్లాలోని జోగులాంబ ఆలయానికి రూ. 20 కోట్లు తెచ్చారు. ఇలానే భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా ఈ స్కీంలో చేర్చాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. సెంట్రల్ సర్వీసులో ఉన్న ఒకనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్‍ గిరిధర్‍ కూడా ఇందుకు ఓకే చెప్పి స్టేట్‍ టూరిజం ఆఫీసర్లను డీపీఆర్ అడిగారు. దీంతో ఐదు రోజుల క్రితం జిల్లాలో టూరిజం ఎండీ  బి.మనోహర్‍, ఈడీ శంకర్‍రెడ్డి పర్యటించారు. రామాయణం ఇతిహాసాలను తెలియజేసేలా భద్రాచలం, పర్ణశాలల్లో అభివృద్ధి చేస్తామంటూ దేవస్థానం ఈవో శివాజీని వెంటబెట్టుకుని పర్ణశాల, భద్రాచలం రామాలయాల్లో పరిశీలించారు. కేంద్రం నుంచి రూ. 50 కోట్ల మేర ప్రసాద్‍ స్కీం కింద తెస్తే చేయాల్సిన పనులు గురించి వివరాలు సేకరించారు. ఇందుకు డీపీఆర్‍ రెడీ చేస్తున్నారు. ఈ పథకం కింద భద్రాచలంలో రామాయణం థీమ్‍పార్కు, లేజర్‍షో ద్వారా రామాయణం ఇతిహాసం వివరించడం, మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం చుట్టూ పర్మినెంట్ పందిళ్లు, ఆలయంలో వంటశాల, స్టోర్‍ నిర్మాణం,  కరకట్టపై గార్డెన్,  టవర్‍హౌస్‍, గ్రానైట్‍తో పడమర, దక్షిణం మెట్ల నిర్మాణం, 2 డార్మెటరీ హాళ్లు, ఆలయానికి పర్మినెంట్ లైటింగ్‍, ఊరు మొత్తం సౌండ్ సిస్టమ్, పర్ణశాలలో ప్రస్తుతం ఉన్న విగ్రహాల స్థానంలో రాళ్లతో విగ్రహాలు ఏర్పాటు చేయడం తదితర పనులు చేపట్టాలని భావిస్తున్నారు.

డీపీఆర్​ పంపితే నిధులొస్తయట

పర్ణశాల, భద్రాచలం ఆలయాల డెవలప్​మెంట్​గురించి టూరిజం ఆఫీసర్లు వస్తున్నరని జిల్లా కలెక్టర్ అలర్ట్ చేసిన్రు. ఎండీ, ఈడీ వచ్చి పర్ణశాల, భద్రాచలం ఆలయాల్లో తిరిగి చూసిన్రు. ఏమేం కావాల్నో అడిగిన్రు. మేం చెప్పినం. డీపీఆర్ పంపితే త్వరలో నిధులొస్తయని చెప్పిన్రు.

– శివాజీ, ఈవో, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం

For More News..

పంచాయతీ కార్యదర్శులకు త్వరలో ప్రమోషన్లు!

ఢిల్లీ పోయొచ్చినంక కేసీఆర్ మారిండు!

ప్రతిపక్ష నేతలకు మంత్రి ఈటల సవాల్‌‌

Latest Updates