SBI చైర్మన్ ఆగ్రహం : ఎగ్గొట్టిన వాళ్లే నీతులు చెబుతున్నారు

sbiప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న డిమాండ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు SBI చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌. అద్దాల మేడల్లో ఉండేవారు అవతలి వారిపై రాళ్లు విసరొద్దంటూ చురకలు అంటించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారని.. ఇప్పుడున్న మొండి బకాయిలు, తక్కువ స్థాయి ప్రమాణాలున్న కేసులు ఎక్కువగా ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయన్నారు.. ప్రస్తుతం లా ట్రైబ్యునల్‌ దగ్గర ఉన్న కంపెనీలన్నీ ప్రైవేట్ బ్యాంక్ లవే అన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్లందరూ కూడా వారి పరిశ్రమలకు చెందిన సంఘాల్లో ముందు వరసలో కూర్చొని సుద్దులు చెబుతున్నారని.. బ్యాంకర్లు వెనక వరసలో ఎందుకు కూర్చోవాలని ప్రశ్నించారు.

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.11వేల 400 కోట్లకి మోసం చేసి విదేశాలకు పారిపోయిన సందర్భంలో బ్యాంకింగ్‌ వ్యవస్థపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా విధానాలు పటిష్ఠంగా లేవని.. వాటి అవసరం లేదని కొటక్‌ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌ కొటక్‌ విమర్శించారు. కొందరు వ్యాపార వేత్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సందర్భంలో వారిపై SBI చైర్మన్‌ రజనీశ్‌ ఎదురుదాడి మొదలుపెట్టారు. సమాజం ఎదిగేందుకు ప్రభుత్వ సంస్థలు కచ్చితమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. పట్టణాలకు దూరంగా పల్లెల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శాఖలను నడుపుతున్న ప్రైవేట్ సంస్థలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Latest Updates