మొండి బాకీల ఖాతాలను బయటపెట్టని ఎస్బీఐ

న్యూఢిల్లీ:  మనదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌‌బీఐ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.12 వేల కోట్ల విలువైన మొండి బాకీల (ఎన్‌‌పీఏ) ఖాతాలను బయటపెట్టలేదు. ఆర్‌‌బీఐ అసెస్‌‌మెంట్‌‌లో ఈ విషయం బయటపడింది. గ్రాస్‌‌ ఎన్‌‌పీఏల విలువ రూ.1.84 లక్షల కోట్లు కాగా, బ్యాంకు మాత్రం వీటిని రూ.1.72 లక్షల కోట్లుగానే చూపించింది. నికర ఎన్‌‌పీఏల విలువ రూ.77,827 కోట్లు కాగా, ఎస్‌‌బీఐ మాత్రం వీటిని రూ.65,895 కోట్లుగానే ప్రకటించింది. అంటే రూ.11,932 కోట్ల ఎన్‌‌పీఏల డైవర్జెన్స్‌‌ జరిగినట్టు ఆర్‌‌బీఐ కనుగొంది. అంటే, బ్యాలన్స్‌‌షీటులో అదనంగా రూ.12,036 కోట్లకు ప్రొవిజన్‌‌ చేయాలి. అలా చేస్తే నోషనల్‌‌ లాస్‌‌ రూ.6,968 కోట్ల వరకు ఉండేది. అయితే ఎస్‌‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో రూ.862 కోట్ల లాభం ప్రకటించింది. మూడో క్వార్టర్‌‌లో గ్రాస్‌‌ ఎన్‌‌పీఏలు రూ.3,143 కోట్లు, ప్రొవిజనింగ్‌‌ రూ.4,654 కోట్లు ఉంటుందని బ్యాంకు తెలిపింది. గత రెండు క్వార్టర్లలో కొన్ని ఖాతాలకు ప్రొవిజనింగ్‌‌ చేశామని  ప్రకటించింది.  గత కొన్ని నెలలుగా చాలా బ్యాంకులు ఎన్‌‌పీఏలను గుట్టుగా ఉంచిన విషయం బయటపడటంతో ఆర్‌‌బీఐ యాక్షన్‌‌ తీసుకుంది. ఎన్‌‌పీఏల లెక్కింపులో పొరపాట్లు దొర్లడం సహజమని ఎస్‌‌బీఐ గత నెల విడుదల చేసిన సర్క్యూలర్‌‌లో పేర్కొంది.

డైవర్జెన్స్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి..

‘‘లిస్టెడ్‌‌ బ్యాంకులు తప్పనిసరిగా డైవర్జెన్స్‌‌, ప్రొవిజనింగ్‌‌ వివరాలను ఎక్స్‌‌చేంజ్‌‌లకు ఇవ్వాలి. రిజర్వ్‌‌బ్యాంక్‌‌ ఫైనల్‌‌ రిస్క్‌‌ అసెస్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ (ఆర్‌‌ఏఆర్‌‌) రిపోర్ట్‌‌ అందిన 24 గంటల్లోపే సమాచారం  వాటికి అందజేయాలి’’ అని ఆర్‌‌బీఐ స్పష్టం చేసింది. సెబీ ఆదేశాల ప్రకారం లోన్‌‌ డైవర్జెన్స్‌‌ గురించి ఎక్సేంజీలకు ఎస్‌‌బీఐ వివరాలను ఇచ్చింది. బ్యాంకు అసెస్‌‌మెంట్‌‌, ఆర్‌‌బీఐ అసెస్‌మెం‌‌ట్ వేరువేరుగా ఉన్నప్పుడు కూడా డైవర్జెన్స్‌‌ సమస్య వస్తుంది. ఎస్‌‌బీఐతోపాటు ఇండియన్ బ్యాంక్‌‌, లక్ష్మీ విలాస్‌‌ బ్యాంక్‌‌, యూనియన్ బ్యాంక్‌‌ ఇండియా, యుకో బ్యాంకు, యెస్‌‌ బ్యాంకులు కూడా గత ఆర్థిక సంవత్సరానికి డైవరెజ్స్‌‌ను ప్రకటించాయి. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్లో ఎస్‌‌బీఐ రూ.3,011 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌‌లో ఇది రూ.944 కోట్ల లాభం మాత్రమే ప్రకటించింది. మార్చి క్వార్టర్లో  మొండిబకాయిలు (ఎన్‌‌పీఏ) రూ.8,805 కోట్లు తగ్గినట్టు  ఎస్‌‌బీఐ పేర్కొంది.

Latest Updates