నాన్ క‌రోనా పేషెంట్ల‌ను ట్రీట్ చేసే డాక్ట‌ర్ల‌కూ పీపీఈ కిట్స్: సుప్రీం కోర్టు

ప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి క‌కావిక‌లం చేస్తోంది. ఈ వైర‌స్ సోకిన వారిని కాపాడే మ‌హా య‌జ్ఞంలో వైద్యులంతా రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రుల‌కు వెళ్లే వారికి ట్రీట్మెంట్ చేయాల‌న్నా డాక్ట‌ర్లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల భార‌త్ లో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల్లో చాలా భాగం ఎటువంటి ల‌క్ష‌ణాలు లేని (అసిం‌ప్ట‌మేటిక్) పేషెంట్లే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ నేస‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు కీల‌క సూచ‌న‌లు చేసింది. క‌రోనాతో సంబంధం లేకుండా మామూలు పేషెంట్ల‌ను చూసే వైద్యుల‌కు కూడా ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ (పీపీఈ) అందుబాటులో ఉండేలా చూడాల‌ని ఆదేశించింది.

అసింప్ట‌మేటిక్ క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెర‌గుతుండ‌డంతో డాక్ట‌ర్లు ఎదుర్కొంటున్న రిస్క్ ను ప్ర‌స్తావిస్తూ సుప్రీం కోర్టులో పిల్ దాఖ‌లైంది. దానిని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించింది. వైద్యులు దేశాన్ని కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ అని, వారికి క‌రోనా సోక‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిద‌ని సూచించింది న్యాయ‌స్థానం. ఈ స‌మ‌స్య‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, డాక్ట‌ర్లు, న‌ర్సులు, వార్డ్ బాయ్స్, పారామెడిక‌ల్ స్టాఫ్ అంద‌రికి అవ‌స‌రాన్ని బ‌ట్టి పీపీఈలు అంద‌జేయాల‌ని కేంద్రానికి సూచించింది. ఈ మేర‌కు నాన్ క‌రోనా పేషెంట్ల‌ను ట్రీట్ చేసే వైద్య సిబ్బందికి పీపీఈలు అంద‌జేసేలా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేయాల‌ని ఆదేశించింది.

Latest Updates