అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై మూడు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ తీర్పునిచ్చింది. పాల్గాడ్‌ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీపై ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు చత్తీస్ గఢ్ , మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో గోస్వామిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ కేసుల్లో మూడు వారాలపాటు గోస్వామిని అరెస్టు చేయరాదంటూ ఉత్తర్వులిచ్చింది. ఈ లోగా ట్రయల్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కు అప్లై చేసుకోవచ్చని సూచించింది. నాగపూర్ లో నమోదైన కేసులను మినహాయించి మిగతా అన్ని ఎఫ్ఐఆర్ లను ధర్మాసనం నిలిపివేసింది. గోస్వామికి సెక్యూరిటీ ఉండేలా చూసుకోవాలని ముంబై పోలీసు కమిషనర్ కు ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తనపై దాడులకు పాల్పడుతున్నారంటూ అర్నాబ్ గోస్వామి ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

Latest Updates