కరోనా చికిత్స మార్గదర్శకాలపై ఐసీఎంఆర్​దే ఫైనల్ డెసిషన్

  • స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: కరోనా ట్రీట్​మెంట్ పై మార్గదర్శకాలను మార్చడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మలేరియా నయం చేసేందుకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ), అజిథ్రోమైసిన్ (ఏజెడ్ఎమ్) కాంబినేషన్ తో ఇతర సమస్యలు వస్తాయన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్ ఇవ్వడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.

పీపుల్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం గురువారం విచారించింది. కరోనా ట్రీట్మెంట్ లైన్‌ను తాను సవాలు చేయలేదని, హెచ్‌సిక్యూ, ఎజెడ్ కాంబినేషన్ వాడకం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయని, దీనివల్ల ప్రజలు చనిపోతున్నారని కోర్టుకు పిటిషనర్ వాదనలు వినిపించారు. ఈ కాంబినేషన్ వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒక అమెరికన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చేసిన తీవ్రమైన హెచ్చరికలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం కరోనా చికిత్సకు మందులు లేవని, అయినా.. డాక్టర్లు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఏ విధమైన చికిత్సా మార్గదర్శకాలను డాక్టర్లు నిర్ణయించాలో, ఏ రకమైన చికిత్సను సూచించవచ్చో కోర్టులు నిర్ణయించలేవని స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

Latest Updates