ప్రభుత్వం చేతిలో కోర్టు బందీ కాదు..వలస కూలీల సమస్యలపై సుప్రీం సీరియస్

న్యూఢిల్లీ: కోర్టు ప్రభుత్వం చేతిలో బందీ కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వలస కూలీలను సొంతూళ్లకు పంపించాలన్న పిటిషన్లపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ కామెంట్ చేసింది. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్​ వాదనలు వినిపిస్తూ… మైగ్రెంట్ లేబర్ల ప్రాథమిక హక్కులు అమలు కాకున్నప్పటికీ, వెరిఫై చేయకుండానే ప్రభుత్వ వాదనను గుడ్డిగా కన్సిడర్ చేస్తున్నారని అన్నారు. దీంతో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, బీఆర్ గవాయ్ లతో కూడిన బెంచ్ సీరియస్ అయింది. ‘‘మీకు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు. కోర్టు ప్రభుత్వం చేతిలో బందీ కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తానెప్పుడూ అలా చెప్పలేదని, తాను తప్పుగా చెప్పినా.. చాలామంది రిటైర్డ్ జడ్జీల అభిప్రాయం ఇదేనని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. వలస కూలీల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఇలాంటి సమయంలో ఎలాంటి నోటీసులు, ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. వివరణ ఇచ్చేందుకు రెండు వారాల గడువు కావాలన్నారు. మైగ్రెంట్ లేబర్స్ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చే ప్రతిపాదన ఏమైనా ఉందో? లేదో? తెలియజేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. వివరణ ఇచ్చేందుకు ఒక్క వారం గడువునిచ్చింది.

Latest Updates