ఎస్సీలకు తగ్గించి.. ఎస్టీలకు పెంచిన్రు

ఎస్సీలకు గతేడాది కన్నా తక్కువ
ఎస్టీలకు రూ.387 కోట్లు ఎక్కువ
డెవలప్‌ మెంట్‌ ఫండ్స్‌‌ ఇద్దరికీ పెంపు
ఎస్సీలకు 16,534 కోట్లు.. ఎస్టీలకు 9,771 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: బడ్జెట్‌‌లో ఎస్సీలకు పైసలు తగ్గించి ఎస్టీలకు పెంచిన్రు. ఎస్సీ అభివృద్ధికి పోయినసారి కన్నా రూ. 143.69 కోట్లు తక్కువ కేటాయిస్తే ఎస్టీ అభివృద్ధికి రూ. 387.56 కోట్లు ఎక్కువిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఈసారి రూ. 4,896.43 కోట్లిస్తే గతేడాది రూ. 4,652.56 కోట్లిచ్చారు.

కోత పెడుతున్రు

ఈ సారి బడ్జెట్‌‌లో ఎస్సీలకు రూ. 2,610.19 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 237.91 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 2,372.28 కోట్లు ప్రతిపాదించారు. గతేడాది బడ్జెట్‌‌లో 2,753.88 కోట్లు పెట్టి అందులో నిర్వహణ పద్దు కింద రూ. 257.98 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 2,495 కోట్లు కేటాయించారు. 2018–-19 బడ్జెట్‌‌లో మాత్రం ఎస్సీలకు భారీగా రూ. 12,709 కోట్లు ఇచ్చారు. తర్వాత రూ. 10 వేల కోట్ల వరకు కోత పెడుతూ వచ్చారు. ఈసారి కల్యాణలక్ష్మికి రూ. 400 కోట్లు కేటాయించారు.

ఎస్టీలకు ఈసారి మరింత ఎక్కువ

గిరిజన సంక్షేమ శాఖకు బడ్జెట్‌‌లో నిధులు కొంచెం పెరిగినయ్‌‌. గతేడాది కన్నా ఈసారి రూ. 387.56 కోట్లు ఎక్కువ కేటాయించారు. ఈసారి రూ. 2,286.24 కోట్లు ప్రతిపాదించి నిర్వహణ పద్దు కింద రూ. 426.26 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.1,859.98 కోట్లు కేటాయించారు. పోయినసారి రూ. 1898.68 కోట్లు ఇచ్చి నిర్వహణ పద్దు కింద రూ.366.18 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.1,532.51 కోట్లు ఇచ్చారు. ఈసారి బడ్జెట్‌‌లో కల్యాణలక్ష్మికి రూ.190 కోట్లు ప్రతిపాదించారు.

ప్రత్యేక నిధులు పెంచిన్రు

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు పెరిగాయి. ఎస్సీ స్పెషల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌కు గతేడాది కన్నా 4,134.97 కోట్లు ఎక్కువ కేటాయించారు. పోయినసారి రూ. 12,400 కోట్లిస్తే ఈసారి రూ. 16,534.97 కోట్లు ప్రతిపాదించారు. 2018–19లో రూ.16,452 కోట్లు ఇచ్చారు. ఎస్టీ స్పెషల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌కు ఈసారి రూ. 2,587.28 కోట్లు పెరిగాయి. పోయినసారి రూ.7,184 కోట్లిస్తే ఈసారి రూ. 9,771.28 కోట్లు ప్రతిపాదించారు. 2018–19లో రూ. 9,693 కోట్లు పెట్టారు.

Latest Updates