పోల్ అఫిడవిట్ కేసులో ఫడ్నవీస్ కు ఊరట

పోల్ అఫిడవిట్ కేసులో ఫడ్నవీస్ కు ఊరట

నాగ్‌పూర్‌‌/ఢిల్లీ: ఎన్నికల అఫిడవిట్ కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​కు కోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుకు సంబంధించిన ట్రయల్​కు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 4న జరిగిన విచారణలో వచ్చే వాయిదా(ఈనెల 24)కు ఫడ్నవీస్​ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ ట్రయల్​పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్​వేశామని ఫడ్నవీస్​ తరఫు లాయర్​ కోర్టుకు తెలియజేశారు. దీంతో నాగ్​పూర్​ కోర్టు ఫడ్నవీస్​కు మినహాయింపు కల్పించింది. సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోతే ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆర్‌‌.ఎమ్‌.సాతవ్‌ ఆదేశించారు. ఫడ్నవీస్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాలని పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ కోరగా నెక్ట్స్‌ డేట్‌న హాజరు కాని పక్షంలో వారెంట్‌ జారీ చేస్తామని చెప్పారు. ఈ  కేసులో గతంలో ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని,  ట్రయల్‌ను మినహాయించాలని కోరుతూ ఫడ్నవీస్‌ వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఓపెన్‌ కోర్టులో విచారణ జరుపుతామని జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, దీప్‌ గుప్తా, అనిరుధ్‌ బోస్‌లతో కూడిన బెంచ్‌ గురువారం ఆర్డర్స్‌ ఇచ్చింది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఫడ్నవీస్‌పై బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేయగా 2019లో బాంబే హైకోర్టు ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. పిటిషనర్‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన సుప్రీం కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది.