బ్యాంకింగ్, టెలికం, విద్యా సంస్థల్లో ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీం

ఆధార్ పై కొన్ని నెలలుగా ఉన్న సస్పెన్స్ కు ఇవాళ (సెప్టెంబర్-26) ఫుల్ స్టాప్ పెట్టింది సుప్రీంకోర్ట్. ఆధార్ రాజ్యాంగ బద్ధతను, వ్యక్తిగత వివరాల భద్రతను సుప్రీంకోర్టు సమర్థించింది. కోర్టు అనుమతి లేకుండా బయటి సంస్థలకు ఆధార్ డేటాను షేర్ చేయొద్దని సూచించింది. డూప్లికేట్ ఆధార్ తీసుకోవడం అసాధ్యం అని చెప్పింది. పాన్ కార్డ్ కు ఆధార్ లింక్ తప్పనిసరి అని తేల్చింది. మిగతా ఐడీకార్డులతో పోల్చితే ఆధార్ ప్రత్యేకమైనదని తెలిపింది. బ్యాంకింగ్, టెలికం, ప్రైవేటు సంస్థలు ఆధార్ ను అడగాల్సిన అవసరం లేదంది. స్కూళ్లు, కాలేజీలు లాంటి విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఆధార్ కార్డు వివరాలు సేకరించొద్దని సూచించింది.

గతంలో ఆధార్ పై పలు ఆదేశాలు ఇచ్చింది కేంద్రప్రభుత్వం. బ్యాంక్ అకౌంట్, పాన్‌ కార్డ్‌, మొబైల్ సిమ్ కార్డ్, ఓటర్ ఐడీ, రేషన్, పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు… ఇలా ప్రజలు ఏ సేవను పొందాలన్నా ఆధార్‌ నంబర్ ను తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్రం ఆదేశించింది. దీనిని సవరిస్తూ ఇవాళ (సెప్టెంబర్-26) తీర్పు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది సుప్రీం. PAN కార్డు, ITRకు ఆధార్ లింకేజీ తప్పనిసరి అంటూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్ట్.

ఆధార్ వ్యక్తిగత గోప్యత అంశంపై తీర్పు చెప్పిన సుప్రీం.. చదువు మనల్ని వేలిముద్ర నుంచి సంతకం స్థాయికి తీసుకెళ్తే…. టెక్నాలజీ మనల్ని సంతకం నుంచి తిరిగి  వేలిముద్రకు తీసుకెళ్లిందని అభిప్రాయపడింది. స్కూల్ అడ్మిషన్లలో ఆధార్ తప్పనిసరి కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. ఆధార్ కార్డు చూపకపోయినా .. స్కూల్ పిల్లలకు ప్రభుత్వ పథకాలను అందించాలని చెప్పింది.

ఆధార్‌ ను తప్పనిసరి చేస్తూ.. టెలికాంశాఖ ఇచ్చిన ఆదేశాలను కొట్టిపారేసింది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 57, సెక్షన్ (2)డీలను కూడా కొట్టి వేసింది సుప్రీం. ఏ మొబైల్ కంపెనీ కూడా ఆధార్ ను అడగవద్దని సూచించింది. యూజీసీ, నీట్, సీబీఎస్ఈ పరీక్షలకు ఆధార్ డేటా మస్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. బయోమెట్రిక్ డేటాను సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా ఏ ఏజెన్సీకి కూడా ఇవ్వొద్దని సూచించింది. అక్రమంగా దేశంలో ఉంటున్న వారికి ఆధార్ కార్డు రాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది.

ఆధార్ డేటా రక్షణ కోసం పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని సూచించింది సుప్రీంకోర్టు. బ్యాంక్ అకౌంట్, స్కూల్ అడ్మిషన్స్,  మొబైల్ కంపెనీలు, ఫ్లైట్ టికెట్లు, ట్రావెల్ ఏజెంట్స్, ఇతర ఏ ప్రైవేటు కంపెనీకి కూడా ఆధార్ ను చూపాల్సిన అవసరం లేదని  వెల్లడించింది. 

Posted in Uncategorized

Latest Updates