ఆయన అమాయకుడంటున్న అవెంజర్స్ బ్యూటీ

మీటూ ఉద్యమం మొదట హాలీవుడ్ లోనే మొదలయ్యింది. అప్పట్లో ఒక రేంజ్ లో గొడవలు జరిగినా, ఆ తర్వాత వేడి కొద్దిగా చల్లారిందనే చెప్పాలి. అయితే స్కార్లెట్ జాన్సన్ చెప్పిన ఒక్క మాటతో అక్కడ మళ్లీ మంటలు రేగాయి.

అవెంజర్స్ చిత్రానికి ఎవరూ ఊహించనంత రెమ్యునరేషన్ తీసుకుని సంచలనం సృష్టించింది స్కార్లెట్. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వేధింపుల ఆరోపణలు ఉన్న దర్శకుడు ఊడీ అలెన్ ను సమర్ధిస్తూ మాట్లాడింది. అంతే… ఒక్కసారిగా వివాదం రేగింది. ‘ఆయన అమాయకుడు. ఆయనతో నాకున్న పరిచయంలో ఆయనెప్పుడూ మిస్​ బిహేవ్ చేయలేదు. అందుకే నేను తన డైరెక్షన్​లో నటించడానికి ఎప్పుడైనా సిద్ధమే’  అంటూ అలెన్​కి సపోర్టుగా మాట్లాడింది స్కార్లెట్​.

​ఆ మాటలకి ఊడీ పెంపుడు కూతురు డైలన్​ ఫారో సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ‘మెరిసేదంతా బంగారం కానట్టే అమాయకత్వం నటించే వాళ్లంతా మంచివాళ్లు కాదు. ఆ అమాయకపు ముసుగు వెనుక కనిపించని క్రూరత్వం దాగి వుంది. దగ్గర నుంచి చూసిన వాళ్లకు మాత్రమే అది తెలుస్తుంది’ అని ఘాటుగా విమర్శించిందామె.

దానికి కారణం వుంది. ఊడీ​, మియా దంపతులు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వాళ్లలో మెక్సికన్​ అమ్మాయి డైలన్ ఒకరు. దత్తత తీసుకున్నప్పటి నుంచే అలెన్​ తనతో ద్వంద్వార్థం వచ్చేటట్టుగా మాట్లాడేవాడని, శరీరాన్ని తాకుతూ ఉండేవాడని చాలా కాలం క్రితమే పెంచిన తండ్రి మీద కేసు ఫైల్​ చేసింది డైలన్. వెంటనే  ఊడీ తాను అలాంటి వాడిని కాదంటూ​ న్యూయార్క్​ సుప్రీం కోర్టుకి అప్పీలు చేసుకున్నాడు​. అప్పటి నుంచీ ఆ కేసు అలా సాగుతూనే ఉంది.

ఎనభై ఏళ్లు దాటిన అలెన్ మీద సినీ పరిశ్రమలోని కొందరు మహిళలు కూడా వేధింపుల ఆరోపణలు చేశారు. అలాంటివాడిని వెనకేసుకు రావడమేమిటని కొందరు స్కార్లెట్ మీద విరుచుకుపడుతున్నారు. కానీ ఆమె మాత్రం తాను అన్న మాటల్లో తప్పేమీ లేదని సమర్ధించుకుంటోంది. ఇది ఎటు పోయి ఎటు వస్తుందో చూడాలి మరి.

Latest Updates