సింగరేణి బొగ్గు టార్గెట్​..675 లక్షల టన్నులు

  •     3000 కోట్ల పెట్టుబడులకు ఓకే 
  •     బోర్డ్​ మీటింగ్​లో
  •     సింగరేణి సీఎండీ శ్రీధర్​

హైదరాబాద్ , వెలుగు: 2020–-21 సంవత్సరంలో 675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సింగరేణి కాలరీస్ సీఎండీ శ్రీధర్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3 వేల కోట్ల  పెట్టుబడుల అంచనా వ్యయానికి బోర్డు ఆమోదం తెలిపిందని సీఎండీ వెల్లడించారు. హైదరాబాద్​లోని సింగరేణి భవన్‌లో శనివారం సీఎండీ అధ్యక్షతన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 675 లక్షల టన్నుల బొగ్గు తీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకునేందుకు బోర్డు ఆమోదించిందన్నారు. అలాగే ఓపెన్‌ కాస్టు గనులకు సంబంధించి వివిధ రకాల ఓవర్​బర్డెన్​(బొగ్గుపై ఉన్న మట్టి ) తొలగింపు పనులకు కూడా ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఓపెన్​కాస్ట్​ గనుల్లో ధూళి నివారణ కోసం స్ప్రింక్లర్‌ ట్యాంకర్లు, భారీ క్రేన్ల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. మైన్​ ప్లాన్ల కొత్త ప్రతిపాదనలకు కూడా బోర్డు ఓకే చెప్పిందని సీఎండీ తెలిపారు. రాష్ట్ర  విద్యుత్  శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌ మిశ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ పీఎస్ఎల్ స్వామి, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ చైర్మన్​ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు.

Latest Updates