బడి పిల్లల్ని ఆటోల్లో కుక్కి.. కుక్కి తీస్కపోతున్నా.. పట్టించుకోని పోలీసులు

  • విద్యార్థులను పరిమితికి మించి తీసుకెళ్తున్న ఆటోలు
  • పట్టించుకోని ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్, వెలుగు: నగరంలోని ఆటోలు, మినీ వ్యాన్లు నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు స్కూల్స్ ప్రారంభమైన టైంలో హడావిడి చేసి తర్వాత సైలెంట్​గా ఉంటున్నారు. దీంతో కెపాసిటికీ మించి విద్యార్థులను ఎక్కుంచుకుని తిరిగే ఆటోలు, మినీ వ్యాన్లు పెరిగిపోతున్నాయి. స్కూల్ బ్యాగ్ లు, పిల్లలు బయటకు వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఆర్టీఏ అధికారుల్లో చలనం ఉండటం లేదు.

ఉప్పల్ లో మంగళవారం జరిగిన యాక్సిడెంట్​తో ఆటోలు, మినీవ్యాన్ల విషయం చర్చనీయాంశమైంది. గతంలోనే కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేవా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా వద్ద మంగళవారం ప్రమాదానికి గురైన ఆటోలో 9 మంది విద్యార్థులు ఉన్నారు. వాస్తవానికి ఆ ఆటోలో 5 మందికి మించి ఎక్కించకూడదు. పైగా స్కూల్ పిల్లలను తీసుకెళ్లేందుకు ఆటోలకు అస్సలు పర్మిషన్ లేదు. కానీ గ్రేటర్ లో ఇలాంటి ఆటోలు, మినీ వ్యాన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. విద్యార్థులను కుక్కి తీసుకెళ్తున్నారు. ఆటోలు, మినీ వ్యాన్ల డ్రైవర్లకు సిటీలో ఇదొక వ్యాపారంగా మారింది. 5 మంది కెపాసిటీ ఉన్న ఆటోలో ఏకంగా15 నుంచి 20 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు.

బస్సులకు మాత్రమేనే రూల్స్

మెదక్ జిల్లాలోని మాసాయి పేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ పిల్లల బస్సు ప్రమాదానికి గురైన సంఘటన తర్వాత స్కూల్ పిల్లల భద్రత అంశాన్ని కఠినం చేశారు. స్కూల్ పిల్లలు ప్రయాణించే వాహనాల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బస్సుల విషయంలో కచ్చితంగా ఫిట్ నెస్ ఉండటంతో పాటు బస్సు నడిపే డ్రైవర్ హెవీ డ్రైవింగ్ లెసెన్స్ ఉండాలని నిర్ణయించారు.

ఏటా స్కూల్ ప్రారంభమయ్యే సమయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని ఆర్టీఏ అధికారులు హడావిడి చేస్తారు. అయితే ఇది స్కూల్ బస్సులకు మాత్రమే పరిమితం అన్నట్లుగా ఆర్టీఏ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆటోలు, మినీ వ్యాన్ ల భద్రత విషయంలో చేతులెత్తేస్తున్నారు. దీంతోనే ఆటోలు, మినీ వ్యాన్ ల యాజమాన్యాలు అక్రమ దందాకు తెగబడుతున్నాయి. మంచిగా పైసలు వస్తుండటంతో ఒక్కో వ్యక్తి మరికొన్ని వెహికల్స్​కొని వ్యాపారాలు చేస్తున్నారు. ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తులకు 8 నుంచి పది వేలు జీతాలు ఇచ్చి డ్రైవర్లుగా నియమిస్తున్నారు.

అధికారుల దృష్టికెళ్లినా..

ఆటోలు, మినీ వ్యాన్ల నిబంధనల ఉల్లంఘనల అంశాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం ఉండట్లేదు. స్కూల్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న ఆర్టీఏ అధికారులు ఆ ఊసే మరిచారు. వాహనాల యాజమాన్యాలకు అధికారుల అండ ఉందన్న ఆరోపణలున్నాయి. సరైన తనిఖీలు, కేసులు లేకపోవటంతోనే ఈ వ్యాపారం కొనసాగుంతోంది. స్కూల్ పిల్లల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. అటు ట్రాఫిక్ పోలీసులు సైతం సామర్థ్యానికి మించి పిల్లలలను తీసుకెళ్తున్నా పట్టనట్లు ఉంటున్నారు. నిత్యం హైదరాబాద్ రోడ్లపై ఇలాంటి వాహనాలు పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నా వదిలేస్తున్నారు.

Latest Updates