ఫ్రెండ్ కోసం మొసలితో పోరాడిన చిన్నారి

కళ్లపై ఆపకుండా పంచ్ లు.. చిన్నారిని వదిలేసిన మొసలి

సిండ్రెలా: తనతో రోజూ ఆడుకునే ఫ్రెండ్ కు అపాయం వచ్చిందనగానే.. ఆ చిన్నారి చూపిన డేర్ సూపర్! ఏదైనా తేడా జరిగితే తన ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితి అది. అయినా లెక్కపెట్టకుండా మొసలిపై నాన్ స్టాప్ గా పంచ్ లు కురిపించి స్నేహితురాలిని కాపాడుకుంది.

జింబాబ్వేలోని గ్రామం సిండ్రెలాలో జరిగిందీ ఘటన. స్కూల్ దగ్గరలో ఉన్న ఓ సరస్సులో స్విమ్మింగ్ కు వెళ్లారు కొందరు చిన్నారులు. వారిలో 9ఏళ్ల చిన్నారి లటోయా మువాని ఉన్నట్టుండి కేకలు వేయడం స్టార్ట్ చేసింది. తనతో వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఏం జరుగుతోందో చూసి షాక్ అయ్యారు. ఓ మొసలి లటోయా చేతిని నోట పట్టి లాక్కెళ్లడం చూసి వారి గుండెలు జారిపోయాయి.

తెగువ చూపి.. మొసలిపై ఎక్కి పిడిగుద్దులు

ఆ చిన్నారులందరిలో ఒకే ఒక్క అమ్మాయి రెబెకా మున్కోంబ్వే తెగువ చూపి ముందుకు దూకింది. తన  ఫ్రెండ్ ను ఎలాగైనా కాపాడుకోవాలని ధైర్యంగా మొసలి వీపుపై ఎక్కింది. ఎంతటి దృఢమైన జంతువైనా దాని కళ్లు సున్నితంగా ఉంటాయని గ్రహించి.. ఆపకుండా పిడిగుద్దులు కురిపించింది రెబెకా. కళ్లు చిదురు చిదురు అయిపోయేలా ఆ చిన్నారి పంచ్ ల మీద పంచ్ లు కొట్టడంతో లటోయాను వదిలేసింది మొసలి. వెంటనే క్షణాల్లో రెబెకా దానిపై నుంచి దూకేసి తన స్నేహితురాలితో ఒడ్డుకు చేరింది. అదృష్టవశాత్తు ఆ మొసలి మళ్లీ అటాక్ చేయాలేదు.

చేతిపై తీవ్ర గాయాలు

రెబెకాకు ఏమాత్రం గాయాలు కాలేదు. కానీ, లటోయా చేతిని మొసలి కొరకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. తనకు ప్రాణాపాయం ఏమీ లేదని, త్వరగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

Latest Updates