ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా టీచర్ల పెన్ డౌన్!.. స్కూళ్లు తెరిచాక పోరు

  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన పీఆర్టీయూ
  • దసరా సెలవులు ముగిశాక ఉద్యమిస్తామని ప్రకటన

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అన్ని విపక్షాలతో పాటు పలు సంఘాలు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇవాళ తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. దసరా సెలవులు ముగిసి స్కూళ్లు తెరిచిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పెన్ డౌన్ కు దిగుతామని టీచర్లు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేయడానికే దసరా సెలవులు పొడిగించారని, ఈ సెలవులు ముగిశాక తాము ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడుతామని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని తీర్మానం

ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు.. ఆర్టీసీ కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తమతో పాటు మొత్తం 22 ఉఫాధ్యాయ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉ:టాయని చెప్పారు. వారి డిమాండ్ల సాధనకు తమ వంతుగా పోరాటంలో కలిసి నిలబడతామని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీర్మానం చేశామన్నారు.

సమ్మెను నిర్వీర్యం చేయడానికే సెలవులు

నియంతృత్వ పోకడలతో సీఎం కేసీఆర్ విద్యా సంస్థలకు దసరా సెలవులు పొడిగించారని, ఈ నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామని పీఆర్టీయూ నేతలు చెప్పారు. విద్యా వ్యవస్థను కూడా ఆర్టీసీ లానే ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేయడానికే సెలవులు పొడిగించారని అన్నారు.

మరో సకల జనుల సమ్మెకు సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వ నియంత పోకడను అంతం చేయడానికి మరో సకల జనుల సమ్మెకు తాము సిద్ధమవుతున్నామని పీఆర్టీయూ నేతలు చెప్పారు. ఏ అధికారంతో, ఎవరిని అడిగి సెలవులు పొడిగించారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నామని అన్నారు. సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్లు తెరిచినా తాము పెన్ డౌన్ చేస్తామని ప్రకటించారు. కార్మిక, ఇతర ఉద్యోగ సంఘాలతో మరోసారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి జేఏసీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పెన్ డౌన్ చేయడం ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Latest Updates