‘కరోనా’ కలవరం.. 25 దేశాల్లో బడులు బంద్​

ప్రపంచాన్ని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. వైరస్​ సోకిన వారి సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉంటే.. చైనా, ఇరాన్​లో మరణాలు కూడా కొనసాగుతున్నాయి. మనదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా ఒక కేరళ చిన్నారితో పాటు నలుగురికి కరోనా పాజిటివ్​ తేలింది. కరోనా టెన్షన్​తో చాలా దేశాలు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నాయి. దీని వల్ల దాదాపు 25 దేశాల్లో 30 కోట్ల మంది స్టూడెంట్లపై ప్రభావం పడుతోందని యునైటెడ్​ నేషన్స్​ వెల్లడించింది. కరోనా కలవరంతో కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై బ్యాన్​ విధిస్తున్నాయి. ఇండియా సహా 13 దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లపై ఖతర్​ తాజాగా నిషేధం విధించింది. సౌదీ కూడా తన పొరుగు దేశాలతో విమాన, సముద్ర ప్రయాణాలను నిలిపేసింది.

స్కూళ్లు మూతపడ్డాయ్

కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పాటు ఇండస్ట్రీలను గజగజ వణికిస్తోంది. కరోనా భయంతో ఎక్కువ మంది జనాలు ఇండ్లకే పరిమితం అవుతున్నాయి. పిల్లలకు కరోనా వస్తుందని తల్లిదండ్రులు బడులకు కూడా పంపడం లేదు. దీంతో చాలా దేశాల్లో ప్రైమరీ స్కూళ్లు నిరవధికంగా మూతపడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్​ అంచనాల ప్రకారం.. దాదాపు 25 దేశాలు స్కూళ్లను మూసేశాయని, దీంతో 30 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం పడిందని తెలిపింది. కొన్ని స్కూళ్లు పూర్తిగా మూతపడితే.. మరికొన్ని తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. 14 దేశాలు దేశవ్యాప్తంగా స్కూళ్లను మూసేశాయి. దీంతో ప్రీ ప్రైమరీ, అప్పర్​ సెకండరీ క్లాసులు చదువుతున్న 29 కోట్ల మంది పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. మరికొన్ని దేశాల్లో తాత్కాలికంగా క్లాసులు నిర్వహిస్తున్నా.. అవి కూడా స్కూళ్లను మూసేయాలని నిర్ణయిస్తే మరో 18 కోట్లమందిపై ఎఫెక్ట్​ పడుతుంది. ఇప్పటి వరకూ స్కూళ్ల మూసివేతకు నిర్ణయం తీసుకున్న దేశాల్లో చైనా, సౌత్​ కొరియా, నార్త్​ కొరియా, జపాన్, ఇరాన్, ఇటలీ, కువైట్, లెబనాన్, మంగోలియా, జార్జియా, బహ్రెయిన్, అర్మేనియా, అజర్​బైజాన్, యూఏఈ మొదలైనవి ఉన్నాయి. తాత్కాలికంగా స్కూళ్ల మూసివేసిన దేశాల లిస్ట్​లో ఇండియాతోపాటు ఆఫ్ఘానిస్థాన్, భూటాన్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇరాక్, పాకిస్థాన్, పాలస్తీనా, ఉక్రెయిన్, బ్రిటన్, అమెరికా, వియాత్నాం మొదలైనవి ఉన్నాయి. స్కూళ్ల మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల మంది స్టూడెంట్లపై ప్రభావం పడితే.. ఇందులో ఒక్క చైనా పిల్లల సంఖ్యే 23 కోట్లకు పైగా ఉంది. అమెరికా న్యూయార్క్​ స్టేట్​లో కరోనా కేసుల సంఖ్య 100 దాటడంతో స్టేట్​ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కొలంబియా యూనివర్సిటీతో పాటు న్యూయార్క్​లోని స్కూళ్లను కూడా మూసేశారు.

చైనాలో 3119కి చేరిన మృతులు

కరోనా ఎఫెక్ట్​ ఎక్కువగా ఉన్న చైనాలో తాజాగా మరో 22 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ ఈ దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,119కి చేరింది. కొత్త కేసుల నమోదు మాత్రం బాగా తగ్గింది. తాజాగా అక్కడ 40 కేసులే నమోదయ్యాయి. వైరస్​ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వూహాన్​లో స్టేడియంలు, ఆడిటోరియంలలో ఏర్పాటు చేసిన 11 టెంపరరీ ఆస్పత్రులను మూసేశారు. ఆదివారం నాటికి చైనాలో మొత్తం కరోనా పేషెంట్ల సంఖ్య 80,735కు చేరింది. వీరిలో 19,016 మందికి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. మరో 58,600 మంది రికవర్​ అయి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. మరోవైపు ఇరాన్​లో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆ దేశంలో 43 మంది ఈ వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఆ దేశంలో చనిపోయిన వారి సంఖ్య 237కు చేరింది. ఇరాన్​లో కొత్తగా 595 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 7,161కు పెరిగింది. ఇరాన్​ రాజధాని టెహ్రాన్ ప్రావిన్స్​​లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ 1,945 కేసులు నమోదయ్యాయి. కొలంబియా, ఆస్ట్రియా, హంగరీ, ఈజిప్ట్, పెరూ, బల్గేరియా, మాల్దీవ్స్​లో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ వెల్లడించింది. దీంతో కరోనా ప్రభావానికి గురైన దేశాల సంఖ్య 90కి చేరిందని తెలిపింది. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,10,041 కేసులు నమోదయ్యాయని, చైనా వెలుపల కొత్తగా 3,610 కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. మొత్తంగా కరోనాతో ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 3,825 మంది చనిపోయారు.

Latest Updates