స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రెండు, మూడ్రోజులకోసారి క్లాసులు

స్కూళ్ల ప్రారంభంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి బడులు తెరవనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 1, 3, 5, 7 తరగతుల పిల్లలకు ఒకరోజు, 2,4,6,8 తరగతుల పిల్లలకు మరో రోజు ఆల్టర్నేటివ్‌గా క్లాసులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించి, ఒక్కో క్లాసు పిల్లలకు రెండు రోజులకోసారి తరగతులు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉన్న స్కూళ్లలో మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు. అన్ని స్కూళ్లలో కరోనా కంట్రోల్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏక్కడా నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశించారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో ఈ విధానం అమలవుతుందని, డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Latest Updates